అనకాపల్లికి చెందిన మాజీ వైకాపా నేత కొణతాల రామకృష్ణ ప్రత్యేక ఉత్తరాంద్ర రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టేందుకు మెల్లగా పావులు కదుపుతున్నట్లున్నారు. ఉత్తరాంధ్రాలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో త్రాగునీరు, సుమారు 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందించేందుకు ఉద్దేశ్యించబడిన సుజల స్రవంతి పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని దానిని తక్షణమే మొదలుపెట్టాలని కోరుతూ ఆయన కొన్ని వారాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, గవర్నర్ నరసింహన్ కి లేఖలు వ్రాశారు. కానీ వారి దగ్గర నుంచి సమాధానాలు రాకపోవడంతో తన నేతృత్వంలోనే ఈనెల 23 నుంచి ఈ మూడు జిల్లాలలో కొణతాల నేతృత్వంలోనే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఆ ప్రాజెక్టు మొదలుపెట్టవలసిన విశాఖ జిల్లాలోని తాళ్ళపాక గ్రామం నుంచే ఆయనే స్వయంగా ఆ కార్యక్రమం మొదలుపెడతారు.
కొణతాల రాజకీయాలలో తన సెకండ్ ఇన్నింగ్స్ తెదేపా లేదా భాజపాతో మొదలుపెడతారని లేకుంటే మళ్ళీ వైకాపాలో చేరవచ్చని భావించారు. కానీ ఆయన ఎవరూ ఊహించని విధంగా ఒక ఉద్యమంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి సిద్దం అవుతున్నట్లున్నారు.
రాష్ట్రంలో తెదేపాకి ప్రత్యామ్నాయంగా బలమైన వైకాపా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆ అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకోలేకపోతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాలలో ఉంది. అందుకే ఏపిలో రాజకీయ శూన్యత ఉందని, దానిని తమ పార్టీయే భర్తీ చేస్తుందని భాజపా నేతలు చెప్పుకొంటుంటారు. అయితే అందరికీ తెలిసిన అనేక కారణాల చేత భాజపా కూడా రాష్ట్రంలో తెదేపా, వైకాపాలకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగలేకపోతోందనే అబిప్రాయం వినబడుతోంది. బహుశః అందుకే కొణతాల రామకృష్ణ తనే ఆ మూడు పార్టీలకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావించి, మెల్లగా ఈ ప్రత్యేక ఉత్తరాంద్ర ఉద్యమానికి రంగం సిద్దం చేసుకొంటున్నారేమోననే అనుమానం కలుగుతోంది. ఆయన చర్యలన్నీ అదే సూచిస్తున్నాయి.
అయితే రాష్ట్రంలో చాలా బలమైన తెదేపా, వైకాపాలను తను ఒంటరిగా డ్డీ కొనగలనని కొణతాల రామకృష్ణ భావిస్తున్నట్లయితే, అది అతివిశ్వాసమే అవుతుంది తప్ప ఆత్మవిశ్వాసం కాబోదు. ఎందుకంటే అయన మంచి సమర్ధుడైన రాజకీయ నేతగా ప్రజలలో గుర్తింపు సంపాదించుకొన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిలకి ప్రజలలో ఉన్న గుర్తింపు, ఆదరణతో పోలిస్తే ఆయన సరితూగాలేరు. పైగా రాష్ట్ర విభజన కారణంగా ఎదురవుతున్న సమస్యలని కళ్ళారా చూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు, ఆయనకి రాజకీయ జీవితం ప్రసాదించేందుకు మళ్ళీ మరోసారి రాష్ట్ర విభజనకి మద్దతు పలుకుతారనుకొంటే అంతకంటే అవివేకం ఉండదు. కనుక కొణతాల రామకృష్ణ అటువంటి ఆలోచనలతో ముందుకు సాగాలనుకొంటే అది చాలా తప్పుడు వ్యూహమే అవుతుంది. ఒకవేళ ఆయన నిజంగానే ఉద్యమాలు మొదలుపెట్టే ప్రయత్నాలు చేస్తే, ప్రభుత్వం వాటిని నిర్దాక్షిణ్యం అణచివేయడానికి వెనుకాడకపోవచ్చు.
కొణతాల రామకృష్ణ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ ప్రజలలో ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకొని స్వంతంగా ఓ రాజకీయ పార్టీ ఏర్పరచుకోవడానికే అయితే అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ అప్పుడైనా అయన మూడు ప్రధాన పార్టీలని డ్డీ కొని ఎదురు నిలవగలరనే నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన కేవలం విశాఖ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే కొంత ప్రభావం చూపగలరు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో సహా మిగిలిన ఏ జిల్లాలలో కూడా ఆయనని ఎవరూ పట్టించుకొనే అవకాశం లేదు. కనుక ఇటువంటి ప్రయత్నాలు చేయడం కంటే ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని సరిదిద్దుకోవడం మంచిదేమో?