ఇది వరకు నవలలకు ఉన్న డిమాండ్ వేరు. టీవీలు తక్కువ. ఇంటర్నెట్, సెల్ ఫోన్లూ లేనే లేవు. అందుకే నవలలే కాలక్షేపం. మహిళల్లో అయితే… నవలల్ని పిచ్చిగా ఆరాధించే వాళ్లు చాలామందే ఉండేవారు. అందుకే అప్పట్లో నవలలకు మంచి గిరాకీ. అవి సినిమాలూగానూ వచ్చాయి. కథలేం దొరకనప్పుడు.. నవలలవైపు చూసేవారు దర్శక నిర్మాతలు.
అయితే ఆ రోజులు పోయాయి. టీవీలూ, సెల్ఫోన్లూ, ఇంటర్నెట్లూ నవలల్ని మింగేశాయి. నవల అనే కాదు. సాహితా ప్రక్రియకే ఈ జనరేషన్ లో స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. కథలే చదవడం లేదు. ఇక నవలలెక్కడ? అయితే `తానా` నవలల పోటీ వల్ల నవలలు రాయాలన్న ఆసక్తి పెరుగుతోంది. లక్షల్లో బహుమానాలు ఉండడంతో ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నారు రచయితలు. అందుకే.. ఈమధ్య కాలంలో మంచి నవలలు వచ్చాయి. ఇటీవల అత్యధిక పాఠకాదరణ పొందిన నవలలన్నీ తానా నుంచి వచ్చినవే కావడం విశేషం. అందులో కొండపొలెం ఒకటి. ఈ నవల చదివి ఇంప్రెస్ అయిన క్రిష్ వెంటనే ఆ హక్కుల్ని కొనడం, సినిమాగా తీయడం జరిగిపోయాయి. తన సినిమాకి `కొండపొలెం` అనే పేరే పెట్టాడు. అక్టోబరు 8న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
కొండపొలెం అంటే.. చాలామందికి తెలియకపోవొచ్చు. అయితే నల్లమల్ల అటవీ ప్రాంతం నేపథ్యంలో నివసించే ప్రజలకు నిత్యం పలుకుబడిలో ఉండే పదం అది. కరువు వచ్చినప్పుడు గొర్రెలకు మేత దొరకదు. అందుకోసం గొర్రెల మందని మేపుకుంటూ అటవీ బాట పడుతుంటారు. ఆ ప్రక్రియని కొండపొలం అంటుంటారు. అలా గోర్రెల మందని మేపుకుంటూ అడవికెళ్లిన కథానాయకుడికి ఎదురైన అనుభవాల సమాహారం ఇది. ఆయా సన్నివేశాల్ని విజువలైజ్ చేయగలిగితే.. కచ్చితంగా జంగిల్ బుక్ లాంటి కథ తయారవుతుందని క్రిష్ భావించాడు. అందుకే.. సినిమాగా తీసేశాడు. ఈ సినిమా మేకింగ్ కి క్రిష్ చాలా సమయం తీసుకున్నట్టే లెక్క. రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేసిన క్రిష్.. పోస్ట్ ప్రొడక్షన్ కి మాత్రం ఏడెనిమిది నెలలు కేటాయించాడు. విజువల్ ఎఫెక్ట్స్ ఎంత బాగా వస్తే.. ఈ సినిమాని ప్రేక్షకులకు అంత చేరువ చేయొచ్చన్నది క్రిష్ ఆలోచన. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఏమాత్రం రాజీ పడడం లేదు. ఇప్పుడు ఆ కార్యక్రమాలూ పూర్తయ్యాయి. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కే కాదు.. ఎమోషన్స్ కీ పెద్ద పీట వేశాడు. ఈ రెండూ సరైన రీతిలో మిక్స్ అయితే… `కొండపొలం` నవలలా.. ఈ సినిమా కూడా ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.