కొండా సురేఖ, కొండా మురళీ ప్రస్తుతం తెరాసలో ఉన్న సంగతి తెలిసిందే. ఒకరు ఎమ్మెల్యేగాను, మరొకరు ఎమ్మెల్సీగాను కొనసాగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర కొండా ఫ్యామిలీది. నిజానికి, వైయస్ హయాంలో వీరికి మాంచి గుర్తింపు ఉండేది. ఆయన మరణం తరువాత కొన్నాళ్లు జగన్ కు అండగా ఉన్నారు. ఆ తరువాత, ఈ దంపతులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తెరాసలో చేరారు. అయితే, వరంగల్ జిల్లాలోని కొండా వైరి వర్గం కూడా ఇప్పుడు తెరాసలోనే ఉంది. దాంతో రెండు కత్తులూ ఒక ఒరలో ఇమడని పరిస్థితి. దీనికి తోడు తెరాసలో తమకు ఆశించిన స్థాయి గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదన కొండా ఫ్యామిలీకి ఎక్కువైందని కూడా కథనాలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. సంగారెడ్డిలో బహిరంగ సభను నిర్వహించారు. అయితే, ఈ సభకు సంబంధించిన అంశాలపై కొండా దంపతులు ఆసక్తి కనబరచినట్టు సమాచారం. వరంగల్ కు చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతల్ని కొండా మురళీ ఇంటికి పిలిపించుకున్నారట. రాహుల్ గాంధీ సభ ఏ విధంగా జరిగిందనీ, కాంగ్రెస్ పట్ల ప్రజల స్పందన ఎలా ఉందనే విషయాలపై చాలాసేపు చర్చించారని సమాచారం. ఇప్పుడు ఇదే విషయం తెరాస వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు! కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీపై ఇంకా మమకారం చంపుకోలేకపోతోందేమో అంటూ తెరాస వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, తెరాసలో ఇమడలేకపోతున్నామన్న ఫీలింగ్ తో ఉంటున్నారు కాబట్టి.. మరోసారి కాంగ్రెస్ పార్టీకి చేరువ అయ్యేందుకు కొండా దంపతులు సిద్ధమౌతున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
సురేఖకు మంత్రి పదవి ఇవ్వకపోతే తెరాసలో ఉండి ఏం ప్రయోజనం అని మురళీ బహిరంగంగానే తన మద్దతుదారులతో చెబుతున్నట్టు సమాచారం. ఏదో ఆశించి తెరాసలోకి వస్తే మరేదో జరుగుతోందన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారట. తాజాగా కాంగ్రెస్ నేతలతో రాహుల్ సభ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం… వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ గూటికి చేరే క్రమంలో కొండా మురళీ, సురేఖ దంపతులు పావులు కదుపుతున్నట్టుగానే ఉంది. కాంగ్రెస్ నేతలతో కొండా ఫ్యామిలీ మీటింగ్ కు సంబంధించిన విషయాలను తెరాస అధినాయకత్వం వరకూ చేరినట్టు సమాచారం. ఈ వ్యవహారం తెరాస వర్గాల్లో వేడి పుట్టిస్తుంటే, కాంగ్రెస్ వర్గాలకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయని చెప్పాలి.