మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంతపై చేసిన వ్యాఖ్యలని ఉపసంహరించుకున్నారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ.. సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. అన్యధా భావించవద్దని’ ట్వీట్ చేశారు.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య విడాకులని ప్రస్తావించడం, అక్కినేని కుటుంబ పరువుని దిగజార్చేలా ఆమె చేసిన వాఖ్యాలపై సర్వాత్ర నిరసన వ్యక్తమైయింది. కొండా సురేఖ వ్యాఖ్యలను అక్కినేని కుటుంబం, సమంత ఖండించారు. మంత్రి వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమలోని నటీనటులు స్పందిస్తున్నారు.
‘వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
‘‘రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అంతా ఖండించాలి’’అని నాని ట్వీట్ చేశారు. వీరితో పాటు అనేక మంది సినీ ప్రముఖులు కొండా సురేఖ వాఖ్యాలని ఖండించారు.
అటు ప్రజల దగ్గర నుంచి కూడా నిరసన గళం వినిపిస్తోంది. ఎవ్వరూ కొండా సురేఖ మాటల్ని సమర్థించలేకపోతున్నారు. భాద్యతగల మంత్రి పదవిలో వుండి ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆమె నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను తప్పుపట్టారు. దీంతో తన తప్పుని గ్రహించిన కొండా తన వ్యాఖ్యలని బేషరతుగా వెనక్కి తీసుకున్నారు.
అయితే కొండా సురేఖ ఉపసంహరణ స్టేట్మెంట్ లో స్పష్టత లేదు. ఆమె కేలవం సమంత పేరునే ప్రస్థావించారు. నిజానికి ఆమె చేసిన వాఖ్యలు నాగర్జున వ్యక్తిత్వాన్ని చాలా చులకనగా చిత్రీకరీంచాయి. కానీ కొండా మాత్రం కేవలం సమంతకే తన మాటలు బాధించాయనే రీతిలో స్పందించారు.
పైగా ఆమె మీడియా ముఖంగా ఓ వీడియో బైట్ రూపంలో అడ్డగోలుగా నీచమైన ఆరోపణలు చేసి, ఇప్పుడు ట్విట్టర్ లో ఉపసంహరణ అనడం తగదు. ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలిసేలా అక్కినేని కుటుంబానికి, సమంతకి క్షమాపణలు కోరాలనేది పబ్లిక్ డిమాండ్.