వైఎస్ కుటుంబంతో కొండా దంపతుల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన కుటుంబసభ్యులుగా వ్యవహరించారు. ఆయన చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలోనూ జగన్ వెంట నడిచారు. అయితే తర్వాత ఏం జరిగిందో కానీ జగన్ మాట ఎత్తడానికి కూడా సురేఖ ఇష్టపడటం లేదు. తాజా తమ బయోపిక్ ను కొండా దంపతులు వర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఏపీలో పర్యటిస్తున్నారు. అక్కడకు వెళ్లి కూడా జగన్ పేరెత్తడానికి ఆమె ఇష్టపడలేదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆయనతో తప్ప మరెవరితోనూ ఆత్మీయత , అనుబంధం లేదని తేల్చేశారు. చివరికి విజయమ్మ, షర్మిలతో కూడా ఎలాంటి అనుబంధం లేదని.. ఎలాంటి మాటలు కూడా లేవని తేల్చేశారు. వైఎస్ఆర్ మరణం తరువాత వైఎస్ కుటుంబాన్ని కలవలేదని చెప్పారు. నిజానికి వైఎస్ మరణం తర్వాత చాలా కాలం జగన్ పార్టీలోనే ఉన్నారు. కానీ ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. మంత్రి పదవిని త్యాగం చేసినా జగన్ ఏదో విషయంలో కొండా దంపతులకు అన్యాయం చేయడంతో వారు జగన్పై తీవ్ర విమర్శలు చేసి పార్టీ నుంచివెళ్లిపోయారు. ఆ తర్వాత జగన్ పేరును గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదు.
ఇటీవల షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. ఓ సందర్భంలో షర్మిల పార్టీలోకి వెళ్తే కొన్ని వందల కోట్లు వస్తాయని .. అయినా తాను వెళ్లదల్చుకోలేదని కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే తాము కొండా దంపతుల్ని చేర్చుకోబోమని షర్మిల పార్టీ నేతలు ఎదురుదాడి చేశారు. ఈ కారణంగానే షర్మిల, విజయమ్మతో కూడా ఎలాంటి సంబంధాలు లేవని కొండా సురేఖ చెబుతున్నట్లుగా ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.