కొండా కుటుంబ సభ్యులు రాబోయే ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలను ఆశించిన సంగతి తెలిసిందే. తెరాసలో ఉండగా కేసీఆర్ ముందు అదే డిమాండ్ ఉంచారు. మరీ ముఖ్యంగా కొండా సురేఖ, మురళీలతోపాటు కుమార్తె సుష్మితాని కూడా రంగంలోకి దించాలని ప్రయత్నించారు. అంతేకాదు, పార్టీ అధిష్టాన నిర్ణయంతో పనిలేకుండా ముగ్గురూ మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నట్టుగానే స్వతంత్రంగా వ్యవహరించారు కూడా! ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దు తరువాత కొండా సురేఖకు మొదటి జాబితాలో కేసీఆర్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో, కొండా ఫ్యామిలీ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరింది. వారు ఆశిస్తున్నట్టుగా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందా అనేదే ఇప్పుడు చర్చ..!
అయితే, పరకాల నుంచి తాను బరిలోకి దిగుతున్నట్టుగా కొండా సురేఖ మీడియాతో చెప్పారు. తన అభిప్రాయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాననీ, వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ, అందుకే తాను పరకాల మీద దృష్టి పెట్టామన్నారు. త్వరలోనే అధికారికంగానే ప్రచారం మొదలుపెడతామన్నారు. అయితే, వరంగల్ తూర్పు నియోజక వర్గ ప్రజలతో సురేఖ సమావేశం కావడం విశేషం. ఎందుకూ అంటే, ఒకేసారి తమని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్తున్నామనే బాధలో ప్రజలు ఉన్నారనీ, వారే స్వచ్ఛందంగా వచ్చారన్నారు. ‘వరంగల్ తూర్పులో మీరు కాకపోయినా, పాపనైనా నిలబెట్టాలంటూ డిమాండ్ చెయ్యడానికి ప్రజలు వచ్చారు’ అన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడి ప్రజల డిమాండ్ ను అధిష్ఠానం ద్రుష్టికి తీసుకెళ్తామన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన కుమార్తె బాగా హర్ట్ అయిందనీ, ఇలాంటి రాజకీయాలు అవసరమా అనే ఒక భావనకి వచ్చిందన్నారు! ప్రస్తుతానికైతే తమ కుటుంబానికి ఒక టిక్కెట్ వచ్చిందనీ, రెండోదానిపై ఇంకా స్పష్టత రావాలన్నారు.
మొత్తంగా, మూడు టిక్కెట్లు తమకు కావాలని పట్టుబట్టిన కొండా దంపతులు… ఇప్పుడు రెండు చాలు అన్నట్టుగానే కాస్త పట్టువిడుపు ధోరణిలో మాట్లాడుతున్నారు. వాస్తవానికి, ఒక్క పరకాల టిక్కెట్ మాత్రమే ప్రస్తుతానికి సురేఖకు కన్ఫర్మ్ అయింది! అయితే, వరంగల్ తూర్పు కూడా తమకే దక్కుతున్న ఆశావహ దృక్పథంతో సురేఖ ఉన్నట్టున్నారు! ఓపక్క పార్టీ నిర్ణయం అంటూనే… వరంగల్ తూర్పు ప్రజలు తమ కుమార్తెను కోరుకుంటున్నారని చెబుతూ ఉండటం గమనార్హం. అయితే, మహాకూటమిలో భాగంగా వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ కి దక్కుతుందా అనే అనుమానాలున్నాయి. ఇదొక్కటేకాదు, కొండా ఫ్యామిలీ ఆశించిన ఇతర స్థానాలపై కూడా కూటమిలో కేటాయింపుల్లో ఏ పార్టీకి వెళ్తాయనే స్పష్టత లేదు. దీంతో మూడు టిక్కెట్లు అనే పట్టుని కొండా ఫ్యామిలీ సడలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.