వరంగల్ పవర్ కపుల్ కొండా మురళి, కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం ఊపందుకుంది. కేసీఆర్ 105 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించినా.. కొండా సురేఖ టిక్కెట్‌ను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క వరంగల్ తూర్పు సీటు విషయంలోనే కేసీఆర్ ఇలా వ్యవహరించారు. కేసీఆర్ ఇవ్వదలుచుకుంటే.. ముందే ప్రకటించేవారని… స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్యకు కూడా టిక్కెట్ ప్రకటింటి.. కొండా సురేఖకు నిలిపివేయడమేమిటని చాలా మంది ఆశ్చర్యం కలిగించింది. పరకాల, వరంగల్ తూర్పు టిక్కెట్లు కావాలంటూ కొద్ది రోజులుగా కొండా దంపతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ కేసీఆర్ దానికి అంగీకరించలేదు. ఇతర టీఆర్ఎస్ నేతలతోనూ వివాదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.
కొద్ది రోజులుగా కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కొండా దంపతులు సంప్రదింపులు జరిపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 12వ తేదీన సోనియా గాంధీ సమక్షంలో కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కొండా వర్గీయులే ప్రచారం చేస్తున్నారు. కుమార్తె సుస్మితాపటేల్కు పరకాల టికెట్, కొండా సురేఖకు వరంగల్ తూర్పు టికెట్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని చెబుతున్నారు. ప్రగతి నివేదన సభకు సంబంధించి కార్యకర్తలను ఉత్సాహపరచడంలో కానీ, సభకు తరలించడంలో కానీ ఉత్సాహం కనబర్చని కొండామురళి అసలు సభకే హాజరు కాలేదు. దాంతో వారు టీఆర్ఎస్ను వదలి పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తేలిపోయిందంటున్నారు.
పార్టీని వీడే విషయంపై.. కొండా సురేఖ శనివారం మధ్యాహ్నం అన్ని విషయాలు వెల్లడించబోతున్నారు. గతంలో వైఎస్‌కు అత్యంత సన్నిహితులైన కొండా దంపతులు..ఆ తర్వాత జగన్ వెంట నడిచారు. కానీ జగన్ వ్యవహారశైలి నచ్చకపోవడంతో తీవ్రంగా విమర్శలు చేసి బయటకు వచ్చారు. గత ఎన్నికల ముందు… టీడీపీలో చేరేందుకు సంప్రదింపులు జరిపారు. కానీ టీడీపీలో చేరకుండా ఆపడం కోసం.. హరీష్ రావు పార్టీ నేతలను బుజ్జగించి మరీ.. టీఆర్ఎస్లో చేర్పించారు. తర్వాత వాళ్లు ఏకుమేకులయ్యారు.