కొండా సురేఖకు మద్దతుగా ఉండాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను ఆమె అలుసుగా తీసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె చేస్తున్న చర్యలు, వ్యవహారశైలి వల్ల కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు మొత్తం రేవంత్ రెడ్డిని కలిసి కొండాల దంపతుల తీరుపై ఫిర్యాదు చేశారు. పార్టీ ఇబ్బంది పడుతోందని చెప్పారు. పార్టీల్లో వర్గ పోరాటం ఉంటుంది కానీ ఇలా కొండా సురేఖపై అందరూ వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఆమె వ్యవహారశైలిలోనే తప్పు ఉందని అందరిీ అర్థమవుతుంది.
కొండా సురేఖ విషయంలో రేవంత్ రెడ్డి పాజిటివ్ గా ఉన్నారు. అందుకే కోరుకున్న సీటును ఇప్పించారు. మంత్రి వర్గంలోనూ చోటు కల్పించారు. ఇటీవల నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల తర్వాత రేగిన దుమారం విషయంలోనూ ఆయన నైతిక మద్దతు అందించారు. నిజానికి రేవంత్ విషయంలోనూ కొండా దంపతులు ధిక్కారం చూపించారు. రేవంత్ రాజకీయ కార్యక్రమాలన్నింటినీ చూసే వేం నరేందర్ రెడ్డి కొండా మురళి తిట్టారన్న ప్రచారం ఉంది. ఆ విషయంలో కొండా మురళిని రేవంత్ మందలించారని కూడా అంటారు. అంత జరిగిన తర్వాత కూడా సపోర్టు చేశారు రేవంత్.
అయితే తమ సహజమైన రాజకీయాలు, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం పెత్తనం మాదే అన్నట్లుగా కొండా దంపతులు చేస్తున్న రాజకీయం ఎవరికీ నచ్చడం లేదు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కొండా సురేఖను పిలిపించుకుని మాట్లాడినట్లుగా తెలుస్తోంది . రాజకీయాలు డైనమిక్ గా ఉంటాయని.. పరిస్థితుల్ని బట్టి మారకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని.. అందరితో కలిసి పని చేయాలని హితబోధ చేసినట్ుగా చెబుతున్నారు. కొండా సురేఖ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. పట్టుదలకు పోతే ఆమెకే నష్టమన్న వాదన వినిపిస్తోంది.