మంత్రి కొండా సురేఖ అసలు తగ్గడం లేదు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో ఆమె పరువు నష్టం కేసులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఫ్లెక్సీల వివాదంలో నేరుగా పోలీస్ స్టేషన్ కే వెళ్లిన ఆమె చేసిన రచ్చతో మరోసారి వివాదాస్పదమయ్యారు. గత ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే పరకాలతో రాజకీయ అనుబంధం ఉన్న కొండా దంపతులు అక్కడ రాజకీయం జోరుగానే చేస్తున్నారు.
పరకాల కాంగ్రెస్ వ్యవహారాల్లో కొండా దంపతుల జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఈ మధ్య కాలాలంలో చాలా వివాదాలు కూడా వచ్చాయి. తాజాగా దసరా సందర్భంగా మరోసారి వివాదం ఫ్లెక్సీల ఏర్పాటు కారణంగా వచ్చింది. పరకాల నియోజకవర్గ పరిధిలోకి వచ్చే గీసుకొండ మండలంలో కొండా మురళి వర్గీయులు పెద్ద ఎత్తున దసరా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి చోటు లేదు. దీంతో ఆయనవర్గీయులు మండిపడ్డారు. కొన్ని చోట్ల ఫ్లెక్సీలు చించేశారు. ఇది ఉద్రిక్తతలకు దారి తీసింది.
పోలీసులు దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోవడంతో నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చారు కొండాసురేఖ. వెళ్లి సీఐ కుర్చీలో కూర్చుని పోలీసుల్నే బెదిరించారు. చివరికి పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ వివాదం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం కావడం… కొండా సురేఖ నేరుగా సీఐ కుర్చీలో కూర్చుని కమాండింగ్ చేయడంతో మళ్లీ విమర్శలు ప్రారంభమయ్యాయి.