హుజూరాబాద్‌లో అభ్యర్థి కోసం అదే పనిగా పరిశీలన జరిపిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చివరికి కొండా సురేఖను పోటీ చేయడానికి ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఆమె అయితేనే కాంగ్రెస్ పోటీలో ఉన్నట్లుగా భావన వస్తుందని లేకపోతే… తేలిపోతుందన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అన్ని రకాల అభిప్రాయ సేకరణలు జరిపి ఈనిర్ణయానికి వచ్చారు. రేవంత్ రెడ్డి చెప్పడంతో కొండా సురేఖ కూడా అంగీకరించారు. అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ప్రభావం చూపగల నేతలుగా కొండా దంపతులు ఉన్నారు. కేసీఆర్‌పై తీవ్రమైన విమర్శలు చేయడంలో ముందున్నారు.
కొండా దంపతులు ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా వెళ్లి బీజేపీలోనో మరో పార్టీలోనో చేరుదామా అనుకుంటున్న సమయంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో ఆగిపోయింది. ఆమెకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇప్పించాలని రేవంత్ చివరి వరకు ప్రయత్నించారు. కానీ.. హైకమాండ్ ఇతరులపై వైపు మొగ్గు చూపింది. అయిన వారు నిరాశపడలేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై చాలా నమ్మకం పెట్టుకున్న కొండా సురేఖ.. పోటీకి సై అంటున్నట్లుగా తెలుస్తోంది.
కొండా సురేఖకు ఫైర్ బ్రాండ్ లీడర్‌గా గుర్తింప ఉంది. ఆమె అయితే గెలిచినా టీఆర్ఎస్లో చేరతారు అనే అనుమానాలు ఉండాల్సిన అవసరం ఉండదు. కొండా సురేఖ కంటే ముందు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ వంటి వారి పేర్లను రేవంత్ పరిశీలించారు. కానీ వారితో సమీకరణాలు కలిసిరాలేదు. చివరికి తన సొంత బాధ్యత తీసుకుని కొండా పేరును ఖరారు చేశారు. పద్దెనిమిదో తేదీన అధికారికంగా కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉంది.