బిజెపి పశ్చిమ బెంగాల్ లో అమలు చేసిన వ్యూహాన్ని తెలంగాణలో కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఒకప్పుడు కమ్యూనిస్టులు , కాంగ్రెస్ కంటే వెనుకబడి ఉన్న బిజెపి, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో ప్రధాన ప్రతిపక్షంగా మారింది. దీనికి ప్రధానంగా అనుసరించిన వ్యూహం అధికార పార్టీ నాయకుల ని తమ పార్టీలో చేర్చుకుని వారితోనే అధికార పార్టీపై విరుచుకు పడడం. ప్రస్తుతం తెలంగాణ పై పూర్తి ఫోకస్ చేసిన బిజెపి ఇదే వ్యూహాన్ని తెలంగాణలో కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈటెల రాజేందర్ బిజెపిలో చేరడానికి నేపథ్యం మొత్తం సిద్ధమైంది. అయితే త్వరలోనే మరొక నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బిజెపిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఆయన ఏ పదవులు, సొంత ప్రయోజనాలు బిజెపి నుండి కోరడం లేదు కానీ ఒకే ఒక షరతు మాత్రం విధిస్తున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
కొండా విశ్వేశ్వర్ రెడ్డి .. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్
కొండ విశ్వేశ్వర్ రెడ్డి చాలామందికి టీఆర్ఎస్ మాజీ ఎంపీ గా మాత్రమే తెలుసు. కానీ ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే విస్తు పోవడం ఖాయం. ఇటీవల కొన్ని మీడియా చానల్స్ మరియు సోషల్ మీడియా చానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కూడా పలు విషయాలను బయటపెట్టారు. ప్రస్తుతం తెలంగాణ లో ఉన్న రంగారెడ్డి జిల్లా, వీరి తాత కొండా వెంకట రంగారెడ్డి పేరుమీద ఏర్పడ్డదే. వీరి పూర్వికులు నిజాం పాలన సమయంలోనే జడ్జిలుగా పనిచేశారు. కొన్ని వేల ఎకరాల ఆస్తి ని కలిగి ఉన్నారు. పైగా ఈయన అమెరికాలో చదువుకున్నారు. ఏదో టైం పాస్ చదువులు కాదు కానీ తన పేరిట యూఎస్ పేటెంట్స్ సైతం కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిగి ఉన్నారు. ఇక ఈయన సతీమణి ఎవరో కాదు అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి కూతురు సంగీత రెడ్డి. రామ్ చరణ్ భార్య ఉపాసన కు ఈయన స్వయాన బాబాయ్.
టిఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత.. సొంతంగా పార్టీ పెడతానంటూ వ్యాఖ్యలు
అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2013లో టీఆర్ఎస్ నేతలు తన వెంట పడి మరీ తనను పార్టీలో చేర్చుకున్నారు అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన చేవెళ్ల నుండి టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. అయితే 2018 లో ఈయన టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు రావడానికి ప్రధాన కారణం కేటీఆర్ తో పొసగక పోవడం అని అంటూ ఉంటారు. అధికారికంగానే వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు కలిగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నుండి మిగతా రాజకీయ నాయకుల లాగా ఎటువంటి ప్రయోజనాలు కోరుకోలేదని, కానీ కేవలం కేటీఆర్ తో వచ్చిన ఈగో క్లాషెస్ కారణంగా ఆయన హర్ట్ అయ్యారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. 2018 లో టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసినప్పటికీ ఆయన ఎన్నికలలో ఓడిపోయారు. అయితే ఎన్నికలకు ముందు తన వారి పై కేసీఆర్ అరెస్టు వారెంట్ జారీ చేయడం , పలు రకాలుగా ఇబ్బందులు పెట్టడం ఆయన ఇంటర్వ్యూలలో ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. అదే ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాబోయే సంవత్సర కాలం లోపు తాను సొంతంగా పార్టీ పెడతానని వ్యాఖ్యలు చేశారు.
బిజెపిలో చేరడానికి ఒకే ఒక షరతు
అయితే మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీ నుండి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ వ్యతిరేకులు అందరినీ కలుస్తూ ఉన్నారు. బిజెపి లో చేరమని ఆయనకు ఎప్పటినుండో ఆహ్వానం ఉన్నప్పటికీ, బీజేపీని తాను నమ్మలేనని, ఆఖరి నిమిషంలో వారు అధికారికంగా కానీ లోపాయికారీగా కానీ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తాను ఏమైపోవాలి అని ఆయన ప్రశ్నించారు. అందుకే సొంత పార్టీ పెట్టుకొని కెసిఆర్ పై పోరాడడమే ఉత్తమమని ఆయన చెబుతూ వస్తున్నారు. అయితే ఇటీవల ఈటెల రాజేందర్ ఢిల్లీ బిజెపి పెద్దలతో చేసిన చర్చల సందర్భంగా బిజెపి టిఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోదని, పైగా ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ ను బిజెపి ఎలా టార్గెట్ చేయాలో సమగ్ర ప్రణాళిక కూడా సమర్పించాడని, దానికి బీజేపీ పెద్దలు అంగీకరించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో బిజెపి కేసీఆర్ తో అధికారికంగా గాని అనధికారికంగా గాని పొత్తు పెట్టుకోవడం కానీ కుమ్మక్కు కావడం కానీ చేయదు అని ఒకే ఒక్క హామీ ఇస్తే బిజెపిలో చేరడానికి తాను సిద్ధం అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.
మొత్తానికి తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారనుంది.