తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితి ఇప్పుడు తిరోగమనంలో ఉంది. ఉవ్వెత్తున ఉన్న పాజిటివ్ వాతావరణం పాలపొంగులా తగ్గిపోతోందని.. ఓ వైపు టెన్షన్ పడుతూంటే… ఇంత కాలం పార్టీలో తొక్కి పెట్టిన అసంతృప్తులన్నీ.. ఒక్కొక్కటిగా బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి … నిన్నామొన్న టీఆర్ఎస్కు రాజీనామా చేసి… కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వేశ్వర్ రెడ్డి .. తను బయట పెట్టిన అంశాలతో.. అటా.. ఇటా అని ఆలోచిస్తున్న టీఆర్ఎస్ నేతల మనసుల్లో మరింత ఉత్సాహం తెచ్చి పెట్టే ప్రయత్నం చేశారు. వ్యూహాత్మకంగా.. కేకే, జితేందర్ రెడ్డి, వినోద్ లాంటి వాళ్ల పేర్లను తన ప్రెస్మీట్లో మాట సందర్భంలో ప్రస్తావించి.. మరింత టెన్షన్ వాతావరణం తెచ్చి పెట్టారు.
తెలంగాణ రాష్ట్ర సమితిలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయన కళ్లకు కట్టినట్లు చెప్పారు. అధికారం మొత్తం ప్రగతి భవన్లో కేంద్రీకృతమై ఉంటుంది. చిన్న కానిస్టేబుల్‌ను బదిలీ చేయాలన్నా.. హోంమంత్రికి అధికారాలు ఉండవు. అంతగా ఒకే చోట అధికారం కేంద్రీకృతమైతే… అసంతృప్తులు సహజంగానే ఉంటాయి . కానీ ఇంత కాలం.. ప్రజల్లో తిరుగులేదు అన్న భావన ఉండటం.. కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోవడం వల్ల.. చాలా మంది.. ఉన్న అధికారం అనుభవిస్తున్నాం కదా అని సైలెంట్‌గా ఉండిపోయారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టీఆర్ఎస్కు స్పష్టమైన ప్రత్యామ్నాయం .. కళ్ల ముందు కనిపిస్తోంది. అందుకే.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బయటకు వచ్చారు. మరికొందరు వస్తారని ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఊహించారు కాబట్టే… ఎంపీలు గట్టుదాటకుండా.. టిక్కెట్లు ఖరారు చేస్తున్నామంటూ ఫీలర్లు పంపుతున్నారు.
అయితే.. పార్టీ మారతారని.. అసంతృప్తిగా ఉన్నారని.. పేర్లు బయటకు వచ్చిన తర్వాత.. వారు ఆయా పార్టీల్లో కుదురుకోవడం.. ముఖ్యంగా టీఆర్ఎస్లో ఉండటం అంత సాధ్యమయ్యే పని కాదు. ఓ పద్దతి ప్రకారం.. ఆయా పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలపై.. ఇతర పార్టీలు.. ఇలా మైండ్ గేమ్ ప్రారంభించి తమ పార్టీలోకి లాగేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి మైండ్ గేమ్.. టీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రయోగిస్తోంది. సొంత పార్టీపై వ్యతిరేకంగా మాట్లాడారని తెలిసిన..ఎంపీల్ని క్షమించలేరు.. అలాగని బయటకు నెట్టేయలేరు. కేసీఆర్ సంగతి తెలుసు కాబట్టి.. వాళ్లే… సమయం చూసుకుని బయటపడాల్సిన పరిస్థితి వస్తుందనేది కాంగ్రెస్ వర్గాల అంచనా…! ఎన్నికల్లోపు.. అంటే పది రోజుల్లోపు ఇంకెన్ని జరుగుతాయో..?