మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చివరికి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన బండి సంజయ్‌తో సమావేశం అయ్యారు. పధ్నాలుగో తేదీన అమిత్ షా అధ్యక్షతన జరగనున్న బండి సంజయ్ పాదయాత్ర ముగింపుసభలో ఆయన బీజేపీలో చేరవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించలేదు. లాగని ధృవీకరించలేదు. బీజేపీ వర్గాలు మాత్రం ఆయన తమ పార్టీలో చేరడం ఖాయమని చెబుతున్నాయి.
కొండా విశ్వేశ్వరర్ రెడ్డి టీఆర్ఎస్ తరపున చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. ఘనమైన కుటుంబచరిత్ర ఉన్న ఆయన టీఆర్ఎస్లో ఇమడలేకపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచే పోటీ చేశారు. కానీ స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు.. ఎవరూ టీఆర్ఎస్పై పోరాడే పరిస్థితి లేకపోవడంతో ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంలో రేవంత్ రెడ్డిది కీలక పాత్ర. తర్వాత రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ కావడంతో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరవచ్చన్న ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. కొండా సానుకూలంగా స్పందించారు కానీ పార్టీలో చేరుతానని ప్రకటించలేదు.
తండ్రి, కొడుకుల్ని అధికారం నుంచి దూరం చేయాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెబుతంటారు. ఒక వేళ తాను ఏదైనా పార్టీలో చేరితే ఆ పార్టీ వెళ్లి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే తన పరిస్థితి ఏమిటని ఆయన వాదన. విచిత్రంగా అటు బీజేపీతో.. ఇటు కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తు ఊహాగానాలు రావడంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోయారు. ఇప్పుడు పీకే ఎఫెక్ట్‌తో ఎన్నికల ముందో.. తర్వాతో టీఆర్ఎస్ చేరేది కాంగ్రెస్ గూటికేనని అనుకుంటున్నారేమో కానీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.