తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పని చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. తాజాగా కోదండరాం కూడా రెడీ అయ్యారు. తెలంగాణ పరిరక్షణకు.. ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తోందని..తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడంకోసం తెలంగాణ శక్తులు, ఉద్యమకారులు ఏకమై రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పార్టీతోనైనా పొత్తుకు రెడీ అని తెలిపారు. అవసరమైతే తమ పార్టీని విలీనం చేస్తామని సంచలన ప్రకటన చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర 3వ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ర్ట అధ్యక్షులుగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం.. పార్టీ జెండా ఎగురవేసి ప్లీనరీని ప్రారంభించారు. తెలంగాణ జన సమితిని కోదండరాం ప్రారంభించారు కానీ ఆయనతో కలిసి పార్టీ పెట్టిన సమయంలో ఉన్న వారంతా దూరమయ్యారు. ఆయన పార్టీ ఉందా లేదా అన్నట్లుగా మారిపోయింది. ఈ తరుణంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినా పర్వాలేదన్నట్లుగా ున్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసి పని చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజల కోసం ఏ నిర్ణయానికైనా తాము వెనుకాడబోమని చెప్పడం అంటే కాంగ్రెస్ కు సంకేతాలు పంపడమే అంటున్నారు. కాంగ్రెస్ తో కోదండరాం ముందు నుంచి మంచి సంంధాలు మెయిన్ టెయిన్ చేస్తున్నారు. గతంలో రాహుల్ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కూడా భేటీ అయ్యారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులు ఏకమవ్వాలన్న రేవంత్.. కోదండరాంను కూడా కలుపుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.