ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన నాయకులతో పార్టీ బలోపేతం అవుతునుగుంటే వచ్చినవారు వచ్చినట్లే రివర్స్ అవుతున్నారు.
గతంలో బీఎస్పీ తరపున పోటీ చేసిన కోనేరు కోనప్ప విజయం సాధించారు. బీఎస్పీ కన్నా ఆయన వ్యక్తిగత బలమే కారణం. తర్వాత బీఆర్ఎస్ లో గెలిచి ఆ పార్టీ తరపున ఓ సారి గెలిచి..మరోసారి ఓడిపోయారు. గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేయడంతో భారీగా ఓట్లు చీలి ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ప్రవీణ్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో అలిగి.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ ఆయనకు ఇంకా కాంగ్రెస్ పార్టీ నేత అనే గుర్తింపు రాలేదు. ఎవరూ పట్టించుకోవడంలేదు.
సిర్పూర్ లో దండె విఠల్ అనే కాంగ్రెస్ నేత పెత్తనం చేస్తున్నారు. దీంతో కోనప్పకు రాజకీయంగా ఊపిరి ఆడటం లేదు. ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో విడుదల చేయించిన నిధులు, అభివృద్ధి పనులను రద్దు చేయడంతో ఆయన ఫీల్ అయ్యారు. కేసీఆర్ దేవుడిలా వంతెన, రోడ్లు, అభివృద్ధి పనులు మంజూరు చేస్తే వాటిని రద్దు చేశారని బహిరంగంగానే చెబుతున్నారు. కాంగ్రెస్ లో పనులేమీ జరగడం లేదంటున్నారు.
బీఆర్ఎస్ లో తనకేమీ అన్యాయంచేయలేదని చెబుతూనే కేసీఆర్ ను పొగడడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూండటంతో ఆయన మళ్లీ కేసీఆర్ దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన సీట్ గ్యారంటీ కోరుకుంటారు. అక్కడ ప్రవీణ్ కుమార్ నే బీఆర్ఎస్ నిలబెట్టే చాన్స్ ఉంటే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అంటున్నారు.