ప్రముఖ పారిశ్రామివేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్ బుధవారం సాయంత్రం వైకాపాకి రాజీనామా చేసారు. వ్యక్తిగాత కారణాలతోనే పార్టీ నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పంపించి, దాని కాపీని ఆయన మీడియాకి కూడా విడుదల చేయడం గమనార్హం. ఆయన తన రాజీనామాకు కారణాలు ఏమీ లేవని చెపుతునప్పుడు, మరి రాజీనామా తతంగం అందరికీ తెలిసేలాగ చేయనవసరం లేదు. కానీ చేసారంటే ఆయన ఆవిధంగా ఎవరికో సందేశం పంపిస్తున్నట్లు అనుమానించవలసి ఉంటుంది.
ఆయనకు శ్రీకాకుళం జిల్లాలో సముద్రపు ఇసుక నుంచి ఖనిజాలు వెలికి తీసే కర్మాగారం ఒకటి ఉందని సమాచారం. దానికి ఎటువంటి అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా ఇసుకను త్రవ్వేస్తూ విలువయిన ఖనిజాలను విదేశాలకు ఎగుమతి చేసి బోలెడంత సొమ్ము సంపాదించుకొంటోందని, కానీ ప్రభుత్వానికి నామమాత్రపు రుసుము చెల్లిస్తోందని, భాజపా ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చేరు. ఆ సంస్థ అక్రమాలను సంబంధిత ప్రభుత్వ శాఖలు ఏవీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొని చూస్తున్నాయని, తక్షణమే దాని అక్రమాలను విచారించేందుకు ఒక కమిటిని వేయాలని ఆయన డిమాండ్ చేసారు.
కోన ప్రసాద్ వైకాపాలో ఉన్నందునే ఈ అంశం తెర మీదకు తీసుకు వచ్చి ఉండవచ్చును. లేదా విష్ణు కుమార్ రాజు నిజాయితీగానే సభలో ఈ అంశం లేవనెత్తి ఉండవచ్చును. వైకాపాకి రాజీనామా చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడాలని కోన ప్రసాద్ భావిస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వైకాపాకు రాజీనామా చేసినంత మాత్రాన్న ఆయన సంస్థ యధాప్రకారం అక్రమంగా ఖనిజాలను విదేశాలకు ఎగుమతి చేసుకొంటే అందుకు తెదేపా ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఒకవేళ అది అంగీకరించినా విష్ణు కుమార్ రాజు అంగీకరిస్తారా? చూడాలి.