కొణిదెల ప్రొడక్షన్ పేరిట ఓ సంస్థ స్థాపించి చిరంజీవి 150వ సినిమాని పూర్తి చేశాడు రామ్ చరణ్. తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన `సైరా`కీ చిరునే నిర్మాత. ఇక మీదట ఈ బ్యానర్లో చరణ్ వరుసగా సినిమాలు చేస్తాడని, బయటి హీరోలతోనూ పని చేస్తాడని ప్రచారం జరిగింది. వీటిని త్రోసి పుచ్చాడు చరణ్. ”ఈ సంస్థ కేవలం నాన్నగారి సినిమాల కోసమే. నా సినిమాలు సైతం.. బయటి బ్యానర్లలోనే చేస్తా. ఎందుకంటే నా చుట్టూ చాలామంచి నిర్మాతలున్నారు. సొంత సంస్థలో సినిమాలు చేసే అవసరం లేదు. నాన్నగారి సినిమాలు నేను చేయాలన్న స్వార్థంతోనే కొణిదెల ప్రొడక్షన్స్ ప్రారంభించా. బయటి హీరోలతో సినిమాలు చేయాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే.. చిత్ర నిర్మాణం చాలా ఒత్తిడితో కూడుకున్నది. నా సినిమాలు చేసుకుంటూ, ప్రొడక్షన్ చేయడం చాలా కష్టం” అని చెప్పుకొచ్చాడు చరణ్. అఖిల్ హీరోగా చరణ్ నిర్మాతగా ఓ సినిమా ఉంటుందని, దానికి బోయపాటి దర్శకుడని ఇది వరకు వార్తలొచ్చాయి. చరణ్ కామెంట్లతో వీటిపై కూడా క్లారిటీ వచ్చేసినట్టే.