కొణతాల రామకృష్ణ వైకాపా నుంచి బయటకు వచ్చేసి సుమారు రెండేళ్ళవుతోంది కానీ ఇంతవరకు ఏ పార్టీలోను చేరలేదు. ఆయన శిష్యులు గండి బాబ్జి, సర్వేశ్వరరావు తెదేపాలో చేరిపోయారు కానీ ఆయన మాత్రం చేరలేదు. ఆయన మళ్ళీ రాజకీయాలలోకి వస్తారో లేదో తెలియదు కానీ, రాష్ట్ర రాజకీయాలలో తన ఉనికిని చాటుకొనే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నట్లే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలుచేయమని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ వ్రాశారు.
మళ్ళీ నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ వ్రాశారు. అందులో సాగునీటి కోసం ఉత్తరాంధ్రలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వ్రాసి, ప్రభుత్వం తక్షణమే వారి సాగునీటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. విశాఖ జిల్లాలో పెద్దేరు, కళ్యాణపులోవ ప్రాజెక్టులు, విజయనగరం జిల్లాలో జంఝావతి, తారకరామ తీర్ధ సాగర్, గుమ్మిడిగెడ్డ ప్రాజెక్టులు, శ్రీకాకుళం జిల్లాలో వంశధార రెండవ దశ ప్రాజెక్టు, బహుదా, వరాహాల గెడ్డ, పెద్ద గెడ్డ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ ప్రాజెక్టులలో కొన్నిటికి ఓడిశా ప్రభుత్వం కల్పిస్తున్న అడ్డంకులను తొలగించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా చొరవ తీసుకోవాలని కొణతాల తన లేఖలో కోరారు.
సాధారణంగా రాజకీయ నేతలు తమ ఉనికిని చాటుకోవడానికే ఈవిధంగా ప్రముఖులకు లేఖలు వ్రాస్తుంటారు. తద్వారా మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించగలుతారు. బహుశః కొణతాల రామకృష్ణ కూడా అదే పని ఇప్పుడు చేస్తున్నట్లున్నారు. కానీ ఆయన రాజకీయాలలోకి రావాలనే ఆలోచన ఉన్నట్లయితే తనకు నచ్చిన ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరితే సరిపోయేది. కానీ ఏ పార్టీలోను చేరకుండా మళ్ళీ రాజకీయాలలో తన ఉనికిని చాటుకొనే ప్రయత్నాలు చేయడం ఎందుకో తెలియదు. ఏ పార్టీలో చేరాలనే విషయంపై ఆయనకి ఇంకా సందిగ్ధంలోనే ఉన్నట్లున్నారు. అందుకే అంత వరకు ఇలాగ ప్రముఖులకు లేఖలు వ్రాసుకొంటూ కాలక్షేపం చేస్తున్నారేమో? ఏమో!