తమ అభిమాన హీరో సినిమా ఫ్లాప్ అయితే… ఫ్యాన్స్ తట్టుకోలేరు. ఆ సినిమా తీసిన దర్శకుడ్ని టార్గెట్ చేయడం, తప్పుల్ని ఎత్తి చూపడం చాలా కామన్. ‘ఆచార్య’ విషయంలో అదే జరిగింది. ఆ మాట కొస్తే.. ఇంకాస్త ఎక్కువ జరిగింది. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ డిజాస్టర్ అవ్వడం మెగా ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. ఆ తరవాత కొరటాలపై వచ్చిన ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. చిరు, చరణ్‌లు తన పని తనని చేసుకోనివ్వలేదని కొరటాల చాలామంది దగ్గర వాపోయినట్టు వార్తలొచ్చాయి. ఈమధ్య ఇంటర్వ్యూలో కూడా నర్మగర్భంగా ఇలాంటి కామెంట్లే చేశాడు కొరటాల. ఎవరి పని వాళ్లు చేసుకొంటే బాగుంటుందని, మరొకరి పనిలో వేలు పెడితేనే సమస్యలు వస్తాయని చేసిన వ్యాఖ్యలు ఇంకాస్త దుమారం రేపాయి. చిరుని ఉద్దేశించే కొరటాల ఈ కామెంట్లు చేశాడని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడ్డారు. ఆ తరవాత కొరటాలపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలెట్టారు.
తాజా ఇంటర్వ్యూలో చిరు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు కొరటాల. చిరంజీవితో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని, దేవర సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతావని ఆయన ఆశీర్వదించారని చెప్పుకొచ్చాడు. దీంతో చిరు – కొరటాల మధ్య ఉన్న ఇష్యూస్‌కి తెర పడినట్టే. చిరు కూడా ఓ ఫ్లాప్ ఇచ్చాడని తన దర్శకుల్ని ఇబ్బంది పెట్టే రకం కాదు. చిత్రసీమలో హిట్లూ, ఫ్లాపులూ మామూలే. దశాబ్దాలుగా చిత్రసీమలో ఉన్న చిరుకి ఇది తెలియని విషయం కాదు. కాకపోతే..`ఆచార్య` ఫ్లాపు నుంచి మెగా అభిమానులే తేరుకోలేకపోతున్నారు. కొరటాల ఏం మాట్లాడినా, దానికి నానార్థాలు తీస్తున్నారు. కొరటాల తన మనసులో ఉన్నది చెప్పేశాడు కాబట్టి, మెగా ఫ్యాన్స్ కూడా కాస్త తగ్గితే, తమ వైపు నుంచి ట్రోలింగ్ ఆపితే బాగుంటుంది. ఈ వివాదానికి శాశ్వతంగా పుల్ స్టాప్ పెట్టినట్టు ఉంటుంది.