ఈమధ్య `రీషూట్` అనే మాట చాలా సర్వ సాధారణమైపోయింది. అందులోనూ పెద్ద సినిమాలకు. ఏకంగా క్యారెక్టర్లనే మార్చేసి, వాళ్లపై తీసిన సీన్లన్ని పక్కన పెట్టి, మళ్లీ కొత్తగా సీన్లు రాసుకుని, తెరకెక్కించిన సందర్భాలున్నాయి. సినిమా పూర్తయినా, కరోనా కారణంగా ఆగిపోయిన సందర్భంలో.. ఆ సినిమాని చూసుకుని, మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం దక్కింది. దాంతో.. రీషూట్లు మొదలైపోయాయి. ఆచార్య విషయంలోనూ చాలానే రీషూట్లు జరిగాయని వార్తలొచ్చాయి. వీటిపై కొరటాల శివ తొలిసారి స్పందించారు. ఆచార్యకు రీషూట్లు ఏం జరగలేదని చెబుతూనే.. అసలు రీషూట్లు చేయడం తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు.
“రీషూట్ అనేది ఓ తప్పుడు భావన కింద తీసుకుంటారు. రీషూట్ చేయడంలో తప్పేముంది? ఓ సీన్ అనుకున్నట్టు రాకపోతే.. మరోసారి తీయొచ్చు. సరిగా లేకపోయినా పాస్ చేయలేం. అది సినిమాని నమ్మి వచ్చే ప్రేక్షకులకు అన్యాయం చేయడం వంటిదే. ఓ సీన్ బాగా వచ్చేంత వరకూ ఎన్నిసార్లయినా తీయొచ్చు. అంతిమంగా ప్రేక్షకుడికి ఆ సీన్ నచ్చేలా చేయడమే దర్శకుడి బాధ్యత“ అని వివరణ ఇచ్చారు. చిరంజీవి, చరణ్‌లు కలిసి నటించిన `ఆచార్య` ఈనెల 29న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.