కథ, క్యారెక్టరైజేషన్, ఎమోషన్.. వీటిపై దృష్టి పెట్టే అతి కొద్దిమంది దర్శకులలో కొరటాల శివ ఒకరు. తాను మాస్ హీరోతో సినిమా చేసినా సరే, అందులోనూ బలమైన సోషల్ మెసేజ్ ఉండాలని భావిస్తుంటాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. ఇలా ఒక దాన్ని మించి మరో సినిమా హిట్టయ్యింది. దర్శకుడిగా తన ముద్ర బలంగా నాటుకుపోయింది. అయితే.. `ఆచార్య`తో ఒక్కసారిగా కొరటాలను కిందకి దించేశారు. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అంతకు ముందు కొరటాల ఇచ్చిన హిట్లన్నీ మర్చిపోయారు జనం. మెగాస్టార్‌ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడన్న నింద మోయాల్సివచ్చింది. పైగా పాదఘట్టం.. అనే పదం, ఆ సెటప్ ట్రోలింగ్ కి గట్టిగా గురైంది.
ఓ దశలో ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందా, లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. మొత్తానికి ‘దేవర’ ప్రాజెక్టును పూర్తి చేసి, విడుదలకు రెడీ చేశాడు కొరటాల. ఇప్పుడు ఈ సినిమాతో హిట్టు కొట్టడం ఎన్టీఆర్ కంటే కొరటాల శివకు చాలా ముఖ్యం. ఎందుకంటే ‘ఆచార్య’ తీసిన ఫ్లాపులో ఉన్నప్పుడు.. ఎన్టీఆరే కొరటాలకు ధైర్యాన్ని ఇచ్చాడు. ‘మనం సినిమా చేద్దాం.. అధైర్యపడకు’ అంటూ ఆపన్న హస్తం అందించాడు. ఓ భారీ డిజాస్టర్ తరవాత ఓ దర్శకుడికి అలాంటి మోరల్ సపోర్ట్ దొరకడం నిజంగా అదృష్టమనే అనుకోవాలి. ‘దేవర’ కాన్వాస్ పెద్దదైపోయిందనుకొన్న తరుణంలో ఈ కథని రెండు భాగాలుగా విభజించారు. అప్పుడు కూడా ఎన్టీఆర్ కొరటాల పక్కనే ఉన్నాడు. పార్ట్ 2 వద్దు, ఈ కథంతా ఒకే భాగంలో చెప్పు అంటే కొరటాల శివ ఆలోచనలు ఎలా ఉండేవో?
Also Read : ట్రైలర్ టాక్: ధైర్యం.. భయం… దేవర
ఒకవేళ దేవరకు అనుకొన్న ఫలితం రాకపోతే, అప్పుడు మళ్లీ వేళ్లన్నీ.. కొరటాల వైపే చూపిస్తాయి. ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడన్న నింద మోయాల్సివస్తుంది. ఈ విషయం కొరటాల శివకూ బాగా తెలుసు. అందుకే కథపైనే కాకుండా, మేకింగ్ పై కూడా పూర్తిగా దృష్టి పెట్టాడు కొరటాల. ఇష్టంగా చేయించుకొన్న పాటలు కూడా కథకు అడ్డొస్తున్నాయన్న కారణంగా కొరటాల పక్కన పెట్టాడని తెలుస్తోంది. ఇవన్నీ వర్కవుట్ అయితే కొరటాల కష్టం ఫలించినట్టే. ‘ఆచార్య’ గాయానికి ‘దేవర’తో మందు దొరికితే… కొరటాలకు మళ్లీ కొండంత ధైర్యం వస్తుంది. కొరటాల కూడా అదే ఆశతో ప్రేక్షకుల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడు.