‘కాస్టింగ్ కౌచ్’ వివాదాలు తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయ్. సమాజంలో, సినిమా ఇండస్ట్రీలో పేరున్న నిర్మాతల తనయులు, దర్శకులు, నటుల దగ్గర్నుంచి కత్తి మహేశ్ వంటి సినిమా విమర్శకుడి వరకూ ఎంతోమంది పేర్లు బయటకు వచ్చాయి. అందులో సందేశాత్మక కథలకు వాణిజ్య అంశాలు జోడించి సినిమాలు తీసే దర్శకుడు కొరటాల శివ పేరూ వుంది. మహేశ్ బాబు హీరోగా ఆయన తీసిన ‘భరత్ అనే నేను’ విడుదలకు ముందు ఆయన పేరు వినిపించడంతో ఇంటర్వ్యూలలో దానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో ‘కాస్టింగ్ కౌచ్’ గురించి తరవాత మాట్లాడతానని సమాధానాలు దాటవేశారు. “ఈ అంశం గురించి తరవాత మాట్లాడతా. ప్రస్తుతం నా దృష్టాంతా సినిమా మీద, సినిమా ప్రమోషన్ మీదే వుంది” – కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించగా కొరటాల శివ సమాధానం చెప్పిన తీరు. ప్రతిసారి ఇదే సమాధానం చెబితే చెల్లదు. సినిమా విడుదల తరవాత తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించుకోవలసిన అవసరం కొరటాలకు వుంది. లేదంటే సినిమాలో చెప్పే నీతులు నిజ జీవితంలో పాటించారా? అని ప్రజలు ఎగతాళి చేసే ప్రమాదం పొంచి వుంది.