నాపేరు సూర్య తరవాత అల్లు అర్జున్ సినిమా ఏంటి? ఎవరితో? అనే విషయంలో ఇంత వరకూ ఓ క్లారిటీ రాలేదు. అయితే బన్నీ జాబితాలో ముగ్గురు దర్శకులు కనిపిస్తున్నారు. రంగస్థలంతో హిట్టు కొట్టిన.. సుకుమార్, వరుస హిట్లతో దూసుకుపోతున్న కొరటాల శివ, యువ దర్శకుడు వీఐ ఆనంద్… ఈ జాబితాలో ఉన్నారు. సుకుమార్ బన్నీకి మంచి మిత్రుడు. సుకుమార్ ప్రయాణం బన్నీతోనే మొదలైంది. వీరిద్దరి మధ్య ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమా చేయగలిగినంత చనువు ఉంది. ‘రంగస్థలం’ చూశాక సుక్కుతో సినిమా చేయాలని బన్నీ తహతహలాడడం సహజం. అయితే బన్నీ కంటే ముందుగా కర్చీఫ్ వేసిన మహేష్ బాబు.. సుక్కుని హోల్డ్ చేసేశాడు. కొత్త దర్శకులతో సినిమా చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు బన్నీ. వీఐ ఆనంద్ సినిమా ‘ఒక్క క్షణం’ కూడా గొప్ప హిట్టేం కాదు. సోసోగా ఆడింది. అందుకే ఆనంద్‌తో సినిమా చేయడం చాలా రిస్క్ అన్నది బన్నీ భయం. అందుకే ఇప్పుడు కొరటాల శివతోనే సినిమా చేయాలని ఫిక్సయిపోయినట్టు తెలుస్తోంది. బన్నీతో కొరటాల కూడా టచ్‌లోనే ఉన్నాడు. కాకపోతే ‘భరత్ అనే నేను’ సినిమా బయటకు వచ్చాక.. అప్పుడు అఫీషియల్‌గా ఓ ఎనౌన్స్మెంట్ ఇద్దామన్నది బన్నీ ఆలోచన. కొరటాల కూడా ‘నా పేరు సూర్య’ రిజల్ట్ ఏమవుతుందా? అంటూ ఎదురుచూస్తున్నాడట. ఈ రెండు సినిమాలూ విడుదలయ్యాక.. బన్నీ – కొరటాల మధ్య ఓ అఫీషియల్ సిట్టింగ్ జరుగుతుందని, ఆ తరవాతే.. కాంబో గురించిన ఓ న్యూస్ బయటకు వదలాలని భావిస్తున్నారన్నది ఇన్సైడ్ వర్గాల టాక్.