టాలీవుడ్లో హిట్లు మీద హిట్లు కొడుతూ, తన సక్సెస్ కాపాడుకుంటున్న దర్శకులు ఇద్దరే ఇద్దరు. ఒకరు రాజమౌళి. మరొకరు కొరటాల శివ. మహేష్ బాబుకి వరుసగా రెండు బ్లాక్ బ్లస్టర్స్ హిట్స్ ఇచ్చి – టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడుగా మారిపోయాడు. ఇప్పుడు చిరంజీవితో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. చిరు కథ దాదాపుగా పూర్తయ్యింది. మరోవైపు కొరటాల నిర్మాతగానూ మారే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓ అగ్ర నిర్మాణ సంస్థతో చేతులు కలిపి కొరటాల ఓ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. ఇందులో కొరటాల మిత్రులు కొంతమంది చేతులు కలపనున్నారని తెలుస్తోంది. ఈ ప్రోజెక్ట్లో కొరటాల కేవలం నిర్మాత పాత్రకే పరిమితం కాబోతున్నాడు. ఓ అగ్ర హీరోతోనే కొరటాల సినిమా ఉండబోతోందని సమాచారం. నిర్మాతగానూ కొరటాల హిట్టు కొడితే – ఇక తాను దర్శకత్వం వహించే సినిమాల్లోనూ నిర్మాతగా వాటా తీసుకునే అవకాశం ఉన్నట్టే. దర్శకులు నిర్మాతలుగా మారడం సహజం. కాకపోతే… చాలామంది చిన్న సినిమాలకే పరిమితం అయ్యారు. కొరటాల మాత్రం భారీ, క్రేజీ ప్రాజెక్టుతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.