చిరంజీవి ఇప్పుడు చాలా బొద్దుగా ఉన్నారు. ఖైదీ నెం 150తో పోలిస్తే ఆయన లావయ్యారనే చెప్పాలి. సైరాకి బరువు, లావు ఇబ్బంది కాదు. ఎందుకంటే.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు ఆ మాత్రం `భారీ`దనం కావాల్సిందే. పైగా కమర్షియల్ సినిమాల్లోలా ఫైటింగులు, స్టెప్పులు ఉండవు కాబట్టి – ఫ్యాన్స్ కూడా సర్దుకుపోతారు. కానీ.. చిరు తదుపరి సినిమాకి అలా కాదు. అది కాస్త కమర్షియల్ కోణంలో సాగేదే. కొరటాల శివ ఎంత సామాజిక నేపథ్యం ఉన్న కథల్ని ఎంచుకున్నప్పటికీ – కమర్షియల్ పరిధి దాటి రాలేడు. పైగా తన హీరో అభిమానులు ఏం కోరుకుంటారో ఆయనకు బాగా తెలుసు. అవన్నీ ఇచ్చేయాల్సిందే. కాబట్టి చిరు.. `ఖైది నెం 150` టైపులో అమ్మడూ కుమ్ముడూ అంటూ కుమ్ముకోవాల్సిన పరిస్థితులు ఇక్కడా ఎదురవ్వొచ్చు.
అందుకే… చిరు బరువు తగ్గాల్సిన అవసరం ఏర్పడింది. కొరటాల కూడా `మీరు బరువు తగ్గాలి` అంటూ పదే పదే గుర్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సైరా షూటింగ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాక.. చిరు బరువు తగ్గడంపై దృష్టి పెడతారని సమాచారం. చిరు కనీసం 15 కిలోలైనా బరువు తగ్గాలని, అందుకోసం ప్రత్యేకమైన డైట్, వ్యాయామాలు మొదలెడుతున్నారని, చిరు కోసం ఓ ట్రైనర్‌ని చరణ్ నియమించాడని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరు రెండు పాత్రలలో కనిపించబోతున్నాడు. ఓ పాత్ర కాస్త బొద్దుగా కనిపించినా ఫర్వాలేదట. అందుకే ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాల్ని ముందుగా చిత్రీకరిస్తారని తెలుస్తోంది. మొత్తానికి చిరుని కాస్త స్లిమ్ముగా చూడబోతున్నామన్నమాట.