జనతా గ్యారేజ్ సినిమాకి ఓ ప్రధాన ఎస్సెట్ మోహన్ లాల్. ఇప్పుడు ఆయనే ఈ సినిమాకి ఓ మైనస్ గా మారతారేమో అని చిత్రబృందం భయపడుతోంది. జనతా గ్యారేజ్ లో మోహన్‌లాల్ జాయిన్ అవ్వడం కచ్చితంగా సినిమాకి పెద్ద ప్లస్సే. మలయాళంలోనూ ఈసినిమాకి మంచి వసూళ్లు రావడం ఖాయం. దాంతో ఎన్టీఆర్ సినిమా రేంజు పెరుగుతుంది. కానీ.. అదే మోహన్ లాల్ వల్ల ఈ సినిమా ఏమైపోతుందో అని భయపడుతోంది చిత్రబృందం. కారణం ఏమిటంటే ఈ సినిమాకి తన సొంత గొంతే వినిపించాలని మోహన్ లాల్ తాపత్రయపడుతున్నారు. ఆయన డబ్బింగ్ చెబుతానంటే ముందు కొరటాల శివ కూడా ఆనందంగా ఒప్పుకొన్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రతిపాదనని విరమించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారాయన.
మనమంతా సినిమా కోసం మోహన్‌లాల్ డబ్బింగ్ చెప్పుకొన్న సంగతి తెలిసిందే. ఆ డబ్బింగ్ సరిగా కుదర్లేదన్నది ప్రచార చిత్రాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇదే విషయం కొరటాల శివని కంగారు పెడుతోంది. దీనిపై మోహన్ లాల్‌తో పలు దఫాలు చర్చించిన కొరటాల… ఇప్పుడు మోహన్ లాల్ పాత్రకు మరొకరితో డబ్బింగ్ చెప్పించాలని డిసైడ్ అయ్యాడట. అయితే ఈ నిర్ణయం మోహన్ లాల్‌కి నచ్చలేదని తెలుస్తోంది. ఒక వేళ డబ్బింగ్ చెప్పనివ్వకపోతే.. ఈ సినిమా ప్రమోషన్లకు రాకూడదని మోహన్ లాల్ డిసైడ్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ బాధ పడలేక మోహన్ లాల్‌తో ఒకట్రెండు సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పించారు కూడా. అది సంతృప్తికరంగా లేకపోవడంతో ‘మీ గొంతు మాకొద్దు సార్’ అని నిర్మొహమాటంగానే మోహన్‌లాల్ తో అనేశారట. దీనిపై మోహన్ లాల్ కినుక వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్రకు ఇప్పుడు ఎవరు డబ్బింగ్ చెబుతారన్నది కీలకంగా మారింది.