Kota Bommali PS Movie Review
తెలుగు360 రేటింగ్ : 2.75/5
మలయాళంలో విజయవంతమైన చిత్రం ‘నాయట్టు’. పొలిటికల్ సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకులు ప్రసంశలు అందుకుంది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ప్రధాన పాత్రలో ‘కోట బొమ్మాళి- P.S’ గా తెలుగులో రీమేక్ చేశారు. గతంలో జోహార్, అర్జున్ ఫాల్గుణ చిత్రాలు తీసిన తేజ మార్ని దర్శకుడు కావడం, బన్నీవాసు నిర్మించడంతో పాటు ‘లింగిడి’ బాగా వైరల్ కావడంతో ప్రేక్షకుల ద్రుష్టిని ఆకర్షించింది. మరి మలయాళంలో విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగు రీమేక్ ఎలా కుదిరింది ? మాతృక ఆత్మని రీమేక్ రూపకర్తలు పట్టుకోగలిగారా?
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, టెక్కలి ఉపఎన్నికల నేపధ్యంలో సాగే కథ ఇది. ఈ ఉప ఎన్నికని రూలింగ్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. రాబోతున్న ఎన్నికలకు రెఫరెండంగా చూస్తుంది. స్వయంగా హోమ్ మంత్రి బరిసెల జయరామ్ (మురళీ శర్మ)ని రంగంలోకి దించుతుంది. ఎన్నికల మూడ్ హోరాహరీగా వుంటుంది. ఎన్నిక జరుగుతున్న ప్రాంతంలోని కోట బొమ్మాళి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంటాడు చింతాడ రామకృష్ణ (శ్రీకాంత్) అదే స్టేషన్ లో రవి (రాహుల్ విజయ్) కుమారి (శివానీ రాజశేఖర్) కానిస్టేబుల్స్ గా పని చేస్తుంటారు. డ్యూటీ ముగించుకొని ఓ పెళ్లి వేడుకకి హాజరౌతారు. తిరుగు ప్రయాణంలో అనుకోకుండా ఓ వ్యక్తి ఆ ముగ్గురు ప్రయాణిస్తున్న జీపుని ప్రమాదవశాత్తు ఢీకొని ప్రాణాలు కోల్పోతాడు. ఆ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అంతకుముందు రోజే పీఎస్ లో జరిగిన ఓ గొడవలో కీలకంగా ఉంటాడు. వీళ్ళ సామాజిక వర్గంకు చెందిన మున్నా (పవన్ తేజ్ కొణిదెల)తో రామకృష్ణ, రవి స్టేషన్ లో గొడవపడతారు. ఈ గొడవ మంత్రి వరకూ వెళుతుంది. ఎన్నికల తర్వాత ఈ సంగతి చూద్దామని ఆ సామజిక వర్గాన్ని బుజ్జగిస్తాడు మంత్రి. ఈ ఇలాంటి సమయంలో ఈ యాక్సిడెంట్ జరుగుతుంది. దీంతో ఆ సామాజిక వర్గం అంతా ధర్నాకి దిగుతుంది. కావాలనే తమ వ్యక్తిని పోలీసులు చంపారని, వాళ్ళపై చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ డిమాండ్. ఇలాంటి సమయంలో కేసుని ఎంత అన్యాయంగా రాస్తారో తన అనుభవంతో పసిగడతాడు రామకృష్ణ. రవి, కుమారిని వెంటబెట్టుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఆ ముగ్గురు పట్టుపడనిదే తాము ఓటింగ్ లో పాల్గోమని చెబుతారు సదరు సామాజిక వర్గ ప్రజలు. దీంతో రంగంలో దిగిన హోం మంత్రి.. ఇరవై నాలుగు గంటల్లో ఆ ముగ్గురిని పట్టుకుంటామని శపథం చేస్తాడు. స్పెషల్ అధికారిగా ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మీ శరత్ కుమార్) ని ఈ ప్రత్యేక మిషన్ లో నియమిస్తాడు. మరి రజియా.. ఈ ముగ్గురిని పట్టుకుందా? అసలు తప్పు చేయని ఆ ముగ్గురు పోలీసులు భయంతో పరారీ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ? ముగ్గురు కానిస్టేబుల్స్ ని పట్టుకోవడానికి అంత స్పెషల్ ఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? రామకృష్ణ గతం ఏమిటి ? రామకృష్ణ తన కూతురు ప్రేమని ఎందుకు నోచులేకపోయాడు ? అసలు ఈ కథలో హీరో ఎవరు ? విలన్ ఎవరు ? ఇవన్నీ తెరపై చూడాలి.
రిమేక్ సినిమా చేసి మెప్పించడం కష్టమే. కథ ఆత్మని పట్టుకోవాలి. నేటివిటీకి మ్యాచ్ చేయాలి. ఒకసారి ఫీలైన ఎమోషన్ ని మళ్ళీ క్రియేట్ చేయాలి. ఇలా చేయాలంటే చాలా నేర్పు కావాలి. ఆ నేర్పు దర్శకుడు తేజమార్ని లో కనిపించింది. ‘నాయట్టు’ నిజాయితీతో కూడుకున్న కథ. ఒక సందేశాన్ని బలంగా ఇవ్వాలని చేసిన ప్రయత్నం కాదు. వ్యవస్థలు ఎలా వున్నాయి ? రాజకీయ నాయకులు అధికారాన్ని ఎలా వాడుకుంటారు ? పోలీసులు ఎలా పని చేస్తారు ? వాళ్ళపై ఎలాంటి ఒత్తిళ్ళు వుంటాయి ? ఓటర్లు ఇంపార్టెంట్ విషయాల్ని వదిలేసి సామజిక సమీరకణల్లో ఎలా ఆలోచిస్తారు ? పొలిటికల్ పార్టీలు ఓటర్లని ఎలా డైవర్ట్ చేస్తాయి? ఇలాంటి అంశాలన్నీ చాలా సహజంగా అల్లుకుంటూ అలోజింపజేసిన చిత్రం ‘నాయట్టు’. మనుషులు, వ్యవస్థలు ఈ దేశంలో దాదాపు ఒకేలా వున్నాయి కాబట్టి ఈ కథకు నేటివిటీ సమస్య లేదు. టెక్కలి ప్రాంతంలో ఈ కథ జరుగుతున్నా అందులోని పాత్రలు సన్నివేశాలు.. యావత్ సమాజ పరిస్థితులని ప్రతిబింబిచేలా తీర్చిదిద్దారు.
ఎన్నికల హడావిడి, పోలీసు స్టేషన్ లో పరిస్థితులని చూపిస్తూ మెల్లగా ఈ కథలోకి తీసుకెళ్ళారు.ఈ కథ ట్రాక్ ఎక్కడాని కాస్త సమయం పడుతుంది. రామకృష్ణ పాత్ర, అతని కూతురితో వున్న అనుబంధం, అటు హోం మినిస్టర్ రంగంలోకి దిగడం, పోలీసులు ఎన్నికల డ్యూటీ చేయడం..ఈ సన్నివేశాలన్నీ ఈ కథకు కావాల్సిన మూడ్ ని క్రియేట్ చేస్తాయి. పోలీస్ స్టేషన్ లో జరిగిన గొడవతో కథలో సీరియస్ నెస్ వస్తుంది. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడి నుంచి కథ పరిగెడుతుంది. ఈ కథని రామకృష్ణ పాత్ర చాలా ఆసక్తికరంగా ముందుకు తీసుకెళుతుంది, మామూలు హెడ్ కానిస్టేబుల్ గా కనిపించిన అతని పాత్ర .. కథ ముందుకు వెళుతున్న కొద్ది పరిధిని పెంచుకుంటూ వెళ్ళడం బావుంది. కూబింగ్ స్పెషలిస్ట్ గా అతని తెలివితేటలు, కొండలు గుట్టల్లో తప్పించుకునే నేర్పు..ఇవన్నీ ఆసక్తిగా వుంటాయి. మరోవైపు వీరిని పట్టుకోవానికి వచ్చిన రజియా అలీ పాత్ర బాగా తీర్చిదిద్దారు. రామకృష్ణ, రజియా పాత్రలు ఆడే మైండ్ గేమ్ అలరిస్తుంది. విరామం ఘట్టం వరకూ కథనం వేగంగా ముందుకు సాగుతుంది.
విరామం తర్వాత వచ్చే డాగ్ చేంజింగ్ సన్నివేశం ఉత్కంఠభరితంగా తీశారు. అయితే ఎప్పుడైతే రామకృష్ణ తలదాచుకోవడానికి ఓ చోటు దొరికిందో అక్కడి నుంచి కొన్ని సన్నివేశాలు రిపీట్ గా అనిపిస్తాయి. పోలీసులు, నక్సలైట్స్ చేసిన జాయింట్ ఆపరేషన్ అంతగా రక్తికట్టలేదు. అలాగే టీవీ రేటింగ్స్ చూసి రామకృష్ణని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు అంత ఆసక్తిగా అనిపించవు. అయితే ప్రీక్లైమాక్స్ లో కథనం మళ్ళీ వేగం పుంజుకుంటుంది. హోం మినిస్టర్ వేసిన ఎత్తుగడ పోలీసులు మెడకు చుట్టుకోవడం, అలాగే రామకృష్ణ పాత్ర తీసుకున్న ఓ అనూహ్యమైన నిర్ణయం .. ఈ కథకు ఒక షాకింగ్ మలుపు ఇస్తుంది. ఆ క్రమంలో వచ్చిన కొన్ని సన్నివేశాలు మనసుని కదిలిస్తాయి. మొదట్లో తన కూతురితో రామకృష్ణ పాత్రకు ఎదో స్పర్ధ వుంటుంది. దానికి గల కారణాన్ని సహజంగా చూపించడం బావుంది. విధి నిర్వహణలో నిస్సాయతని ఆ సన్నివేశం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. చివర్లో కోర్ట్ రూమ్ డ్రామా కూడా ఆసక్తిగానే వుంటుంది. హోం మినిస్టర్ కుక్క ని రిఫరెన్స్ గా తీసుకొని చెప్పిన మాటలు జాగ్రత్తగా వింటే.. ఈ కథలోని సారం మరింత చక్కగా బోధపడుతుంది.
శ్రీకాంత్ ఒకప్పుడు స్టార్ కథానాయకుడు. అయితే హీరోగా ఆయన మార్కెట్ దగ్గిన తర్వాత కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేశారు. ఆ పాత్రలన్నీటి కంటే ఇందులో చేసిన రామకృష్ణ ఉత్తమమైనదిగా చెప్పుకోవాలి. అతని కెరీర్లోనే గుర్తుపెట్టుకునే పాత్ర ఇది. తన అనుభవంతో ఆ పాత్రని చాలా సహజంగా చేసుకొచ్చారు. ఇది పూర్తిగా హీరో పాత్ర కాదు. చాలా లేయర్లు వున్నాయి. అవన్నీ చక్కగా ప్రదర్శించారు. చివర్లో రామకృష్ణ పాత్ర కంటతడి పెట్టిస్తుంది. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్.. ఎంతో సహజంగా ఆ పాత్రలని పండించారు. ఈ సీరియస్ థ్రిల్లర్ లో హోం మినిస్టర్ గా చేసిన మురళీ శర్మ పాత్ర కాస్త రిలీఫ్. అతనికి ఇచ్చిన డైలాగులు మేనరిజం బావున్నాయి. రజియా పాత్రకి వరలక్ష్మీ కావాల్సిన ఎనర్జీని నింపింది. కఠినమైన పోలీసు అధికారిగా తన పాత్రని డిజైన్ చేశారు. హోం మినిస్టర్, రజియా పాత్రల సంభాషణలు ఆకట్టుకునేలా వుంటాయి. మిగతా పాత్రలన్నీ పరిధిమేర సహజంగా కనిపించారు.
నిర్మాణ పరంగా మంచి జాగ్రతలు తీసుకున్నారు. నేపధ్య సంగీతం బావుంది. లింగిడి పాట ప్లేస్ మెంట్ చక్కగా కుదిరింది. కెమరా అన్నీ రియల్ లోకేషన్స్ లో తిరగడంతో ప్రతి ఫ్రేంలో జీవం వున్నట్లు అనిపించింది. ఉత్తరాంధ్ర, ముఖ్యంగా టెక్కలి ప్రాంతం యాసలో ఓ సొగసు వుంటుంది. ఆ మాటల్ని చక్కగా పట్టుకున్నారు. దాదాపు అన్నీ పాత్రలతో మంచి డబ్బింగ్ చెప్పించారు. మాటల రచయిత అవసరం వున్న చోట్ల ఆలోజింపచేసే మాటలు రాశాడు. ‘న్యాయం మీద రాజకీయం గెలవకూడదు’.’ నిజం నిరూపించడానికి సాక్ష్యం కావాలి కానీ అబద్దం నిరూపించడానికి సాక్ష్యంతో పని లేదు’’ ఇలాంటి సింగిల్ లైనర్స్ కనెక్టింగా వుంటాయి. కమర్షియల్ హంగుల జోలికి పోకుండా సమాజంలో సహజంగా పుట్టిన కథని అంతే సహజంగా చూపించే ప్రయత్నం చేశారు. సహజత్వంతో కూడుకున్న సినిమాలని ఇష్టపడేవారికి కోట బొమ్మాళి మరింతగా కనెక్ట్ అవుతుంది.
తెలుగు360 రేటింగ్ : 2.75/5