కోట బొమ్మాళీ.. ప్రెస్ మీట్ కాస్త కొత్తగా నిర్వహించే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. ఎప్పుడూ పాత్రికేయులే ప్రశ్నలు వేయాలా? మేం వాళ్లని అడక్కూడదా? అనే కాన్సెప్టుతో జర్నలిస్టుల్ని, రివ్యూ రైటర్లనీ.. వేదికపై కూర్చోబెట్టి, దర్శకులు, నిర్మాతలూ మైకులు పట్టుకొని ప్రశ్నలు సంధించారు. నిజానికి ఇది కొత్త తరహా పబ్లిసిటీనే. కాకపోతే… సదరు ప్రశ్నలు అడిగేవాళ్ల ఎజెండా మాత్రం కాస్త పర్సనల్ అయిపోయింది.
ఈ కార్యక్రమంలో దర్శకుడు సాయి రాజేశ్.. రివ్యూ రైటర్లని ఉద్దేశించి ఓ ప్రశ్న లేవనెత్తారు. వెబ్ సైట్లు, రివ్యూ రైటర్లందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారన్నది ఆయన వాదన. 2.5, 2.75, 3.. వెబ్ సైట్లు ఇలా రేటింగులు ఇచ్చి, ఆత్మరక్షణలో పడిపోతున్నాయని, బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాలకు సైతం 5కి 5 రేటింగు ఇవ్వలేదని, 4, 4.5, 5 ఇచ్చే సినిమాలు తెలుగు చిత్రసీమలో రాలేదా? అనేది ఆయన ప్రశ్న.
దర్శకుడిగా, ఓ సినిమా అభిమానిగా ఆయన ఆంతర్మధనం కరెక్టే కావొచ్చు. ప్రతీ సినిమానీ ప్రేమిస్తే.. అన్నింటికీ వందకు వంద మార్కులూ వేయాల్సిందే. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం… తెలుగులోనే కాదు, ప్రతీ చోటా ఇదే పరిస్థితి. ఆఖరికి హాలీవుడ్ లో కూడా. 5కి 5 రేటింగు ఇచ్చిన సినిమాలు హాలీవుడ్ లో కూడా లేవు. అలాగని టైటానిక్, అవతార్ లాంటి సినిమాలకు ఆ అర్హత లేదా? అవి గొప్ప సినిమాలు కాలేదా? సాయి రాజేష్ ఉదహరించిన బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ లాంటి సినిమాల్ని విమర్శించిన వాళ్లూ ఉన్నారు. కొంతమందికి ఆ సినిమాలూ నచ్చలేదు. రివ్యూలు సినిమాల జయాపజయాల్ని డిజైన్ చేయలేవు. ఓ మంచి సినిమాని ఇంకాస్త పైకి తీసుకెళ్లగలవు, లేదా చెత్త సినిమా బారీన పడకుండా ప్రేక్షకుల్ని ఆపగలవు. అంతే. ప్రతీ సినిమాలోనూ ఏవో కొన్ని లోపాలు, లోటుపాట్లూ ఉంటాయి. వాటిని బేరీజు వేయాల్సిన బాధ్యత.. రివ్యూ రైటర్‌దే. అలాగని రివ్యూలే… శాసనం, అదే ప్రజల తీర్పు కాదు. సినిమా ఏమీ లెక్కల పేపర్ కాదు. ఆన్సర్లు కరెక్ట్‌గా ఉంటే వందకు వంద రావడానికి. హిట్టు సినిమాకి ఫార్ములా లేదని చెప్పే దర్శక నిర్మాతలు ఈ లాజిక్ ఎందుకు మిస్సవుతారో? అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. కేవలం రివ్యూ రైటర్ దృష్టి కోణం నుంచి మాత్రమే రివ్యూలు చూడాలి. ఈ విషయం సాయి రాజేష్ లాంటి నవతరం దర్శకులు గుర్తు పెట్టుకోవాలి.
సాయి రాజేష్ ఇటీవల బేబీ అనే సినిమా తీశారు. అది సూపర్ హిట్టయ్యింది. ఏ రివ్యూ చూసినా 2.75 రేటింగు తక్కువ లేదు. అంత సూపర్ హిట్టయిన సినిమా నాలుగో, నాలుగున్నరో ఇవ్వాలి కదా? అనేది సాయి రాజేష్ ఆలోచన, అభిప్రాయం కావొచ్చు. కానీ ఇదే సినిమా విషయంలో సాయి రాజేష్‌లో కాస్త అసంతృప్తి ఉంది. `నేను ఒకటి అనుకొన్నాను. ప్రేక్షకులకు మరోలా అర్థమైన సినిమా ఇది` అంటూ తన సినిమాని అప్పల్రాజు సినిమాతో పోల్చారు. అంటే తాను తీసిన సినిమాలోనే, జనం హిట్ చేసిన సినిమాలోనే, నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలోనే కొన్ని లోపాలు ఆయనకే కనిపించాయన్నమాట. మరి చూసేవాళ్లకు, రివ్యూలు రాసేవాళ్లకు ఇంకెన్ని లోపాలు కనిపిస్తాయో కదా?