ఈరోజు ఉదయమే ఓ దుర్వార్త. కోట శ్రీనివాసరావు మరణించారని. సోషల్ మీడియాలో ఇదే.. హాట్ టాపిక్. అయితే ఇది అచ్చంగా ఫేక్ వార్త. కోట ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పుడు ఓ వీడియో కూడా వదిలారు. ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దని ఆయన తన అభిమానుల్ని కోరారు. అంతేకాదు.. డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయని, ఇలాంటి వార్తలతో మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని ఆయన హెచ్చరించారు. “రేపు ఉగాది ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తుంటే, పొద్దుటే ఏడున్నర నుంచి ఒకటే ఫోన్లు. నేనే కనీసం 50 మందితో మాట్లాడి ఉంటాను. నేను బాగానే ఉన్నానని చెప్పుకొంటూ వచ్చాను. నాకేదో అయిపోయిందని మా ఇంటికి పోలీసు వ్యాను కూడా వచ్చేసింది. ఇలాంటి ఫేక్ వార్తలు పుట్టించొద్దు. నాకంటే పెద్దవాళ్లయితే.. ఇలాంటి వార్తలు విని గుండాగి చచ్చిపోతారు“ అంటూ ఓ సందేశాన్ని వీడియో రూపంలో ఉంచారు.