రెండ్రోజులుగా సోషల్మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. నటుడు కోట శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించిందని, ఆయన ఆసుపత్రి పాలయ్యారన్నది వార్తల్లో సారాంశం. దీనిపై కోట శ్రీనివాసరావు మండిపడ్డారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, కీళ్ల నొప్పులు తప్ప పెద్దగా సమస్యలు లేవని, షూటింగులు కూడా చేసుకొంటున్నానని చెప్పుకొచ్చారు కోట. తన చుట్టాలకు ఒంట్లో బాలేకపోవడం వల్ల వాళ్లని చూడ్డానికి ఇటీవల ఆసుపత్రికి వెళ్లొచ్చినట్టు, మీడియాలో అది మరో రకంగా వస్తోందని, అది చూసి బంధువులు, స్నేహితులు, అభిమానులు కలవరపడుతున్నారని వాపోయారు కోట. ”సంచలనం కోసం ఏవో వార్తలు రాస్తున్నారు. వీడియోల రూపంలో యూ ట్యూబ్లో పెడుతున్నారు. సోషల్ నెట్ వర్క్ ఇప్పుడు పూర్తిగా వ్యాపారం అయిపోయింది. మొన్నటికి మొన్న సుశీల విషయంలోనూ ఇలాంటి వార్తే వచ్చింది. నేను బతికే ఉన్నా అంటూ ఆమె ఓ వీడియో పంపాల్సివచ్చింది. మేం బతికే ఉన్నాం అని చెప్పుకోవాలా” అని ఆవేదన వ్యక్తం చేశారు కోట. ఇప్పటికైనా ఈ వార్తలు ఆగుతాయేమో చూద్దాం.