ఎన్టీఆర్ అభిమానులు, ఆయన్ని విమర్శించేవారూ… ‘మండలాదీశుడు’ సినిమాని మర్చిపోలేరు. ఎన్టీఆర్‌పై, ఆయన పాలనపై అదో సెటైర్. ఎన్టీఆర్ హయాంలో.. ఎన్టీఆర్‌ని విమర్శిస్తూ, సెటైరికల్ సినిమా తీయడం నిజంగా గొప్ప సాహసం. ఎన్టీఆర్ పాత్రలో కోట శ్రీనివాసరావు నటించారు. అది కూడా కొంతమంది బలవంతం చేయడంతో. ఆ సినిమా అటూ ఇటూ అయినా, ఎన్టీఆర్ అభిమానులు తనపై పగబట్టినా, తన సినిమా కెరీర్ అక్కడితో అంతం అయిపోతుంది. అయినా సరే, కోట ధైర్యం చేశాడు. ఎన్టీఆర్‌కి ఎదురెళ్లి మరీ ఆ సినిమా పూర్తి చేశాడు.
సినిమా విడుదలైన తరవాత.. చాలా విమర్శలకు గురైంది. ముఖ్యంగా కోట శ్రీనివాసరావుకి సినిమా అవకాశాలు తగ్గాయి. కోటకి ఛాన్స్ ఇస్తే, ఎన్టీఆర్ నుంచీ, ఆయన వర్గం నుంచీ, ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయన్నది దర్శక నిర్మాతల భయం. అందుకే కోట చేతిలోంచి సినిమాలు జారిపోయాయి. అంతేకాదు.. కొంతమంది టీడీపీ ఎం.ఎల్.ఏలు కోటకు ఫోన్ చేసి ‘ఎన్టీఆర్‌ని అవమానిస్తూ సినిమా తీశారు. మీకెందుకొచ్చిన గొడవ..’ అంటూ పరోక్షంగా బెదిరించడం మొదలెట్టారు. కోట ఇంటిపై కూడా చాలాసార్లు దాడులు జరిగాయి. ఓసారి కోట బెజవాడ వెళ్లారు అదే సమయంలో ఎన్టీఆర్ అభిమానులు అక్కడ గుమిగూడారు. కోటని చూసి ఆవేశంతో వెంటపడ్డారు. ‘మా నాయకుడ్ని అవమానించే పాత్ర చేస్తావా’ అంటూ భౌతికంగానూ దాడి చేశారు. ఆ క్షణంలో ఏదోలా ప్రాణాలతో బయటపడగలిగాడు కోట.
ఇలానే రోజులు కొనసాగితే.. ఎన్టీఆర్ అభిమానులు తనపై కక్ష కట్టే ప్రమాదం ఉందని కోటకి భయం వేసింది. ఎలాగోలా ఈ చాప్టర్‌కి ముగింపు పలకాలని భావించాడు. ఆ అవకాశం అనుకోకుండా వచ్చింది. ఓసారి చెన్నై ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్‌ని కలిసే అవకాశం వచ్చింది కోటకు. అప్పటికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. చుట్టూ జెడ్ కాటగిరీ సెక్యురీటీ ఉంది. అయినా సరే, ఆ సెక్యురిటీని ఛేదించుకుని మరీ.. ఎన్టీఆర్‌ని కలుసుకుని, కాళ్లమీద పడిపోయాడు కోట. అయితే ముందు ఎన్టీఆర్ కోటని గుర్తు పట్టలేదు. ఆ తరవాత ‘ఏం బ్రదర్… మీరా… ఆరోగ్యం ఎలా వుంది..’ అంటూ కుశల సమాచారం అడిగారు. తాను ఏ పరిస్థితుల్లో మండలాదీశుడు సినిమా చేయాల్సివచ్చిందో ఎన్టీఆర్‌కి వివరించి, ఆయన ఆశీర్వాదలు తీసుకుని అక్కడి నుంచి బయట పడ్డాడు కోట. అలా ఎన్టీఆర్ తో వైరం అనే ఎపిసోడ్‌కి తనంతట తానే తెరదించుకోగలిగాడు కోట.