సొంత పార్టీ వాళ్లయినా… చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకూ మాటల్లో చెప్పారు. ఇప్పుడు చేతల్లో కూడా చూపించారు. తమ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగిని ఇంటిపై దాడికి పాల్పడినట్లుగా.. కేసు నమోదు కావడంతో.. చట్ట ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. తెల్లవారుజామునే ఆయనను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టారు. వెంటనే ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే.. పోలీసులు ఈ విషయంలో ధైర్యంగా అడుగు ముందుకేసేలా సీఎం జగన్… వారికి ఆదేశాలిచ్చారు.
సహజంగా అధికార పార్టీకి చెందిన నేతలు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా.. పోలీసులు కేసులు పెట్టడానికే మీనమేషాలు లెక్కిస్తారు. ప్రభుత్వ పెద్దలకు ఎక్కడకోపం వస్తుందో.. తమను ఎక్కడ.. ప్రతిపక్ష పార్టీకి చెందిన సానుభూతి పరుల ఖాతాలో వేస్తారోననే భయం చెందుతారు. అంతే కాకుండా… ఆయా నియోజకవర్గాల్లో పోలీసులు… ఎమ్మెల్యేల సిఫార్సులతోనే పోస్టింగులు తెచ్చుకుంటారు. తాము అక్కడికి రావడానికి కారణమైన వారిపై అంత త్వరగా కేసులు పెట్టరు. పై నుంచి ఆదేశాలు వస్తేనే ఏదైనా సాధ్యం. ఈ విషయంపై స్పష్టత ఉంది కాబట్టి వెంటనే.. సీఎం జగన్.. పోలీసులు.. శాంతిభద్రతల అంశంలో రాజీపడకుండా.. ఉండేలా.. ధైర్యం కల్పిస్తూ.. చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదనే సందేశాన్ని తన ఆదేశాల ద్వారా పంపారు.
గత ప్రభుత్వంలో చింతమనేనిపై చాలా కేసులు నమోదైనా.. ఒక్క సారి కూడా అరెస్ట్ చేయలేకపోయారు. కనీసం చిన్న కేసుల్లోనూ అరెస్ట్ చూపలేకపోయారు అయితే.. శ్రీధర్ రెడ్డి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరే వివాదాస్పదంగా ఉంది. ఉద్యోగినిపై దాడి వ్యవహారం సీరియస్ ఇష్యూ అయినా చాలా చిన్న పెట్టీ కేసులు పెట్టారు. దాంతో శ్రీధర్ రెడ్డికి వెంటనే బెయిల్ వచ్చింది. ఈ విషయంపై… విమర్శలు చెలరేగుతున్నాయి. విమర్శలకు జడిసి… పెట్టీ కేసులు పెట్టి అరెస్ట్ చూపించారని అంటున్నారు. అయితే.. తాము చట్ట ప్రకారమే ముందుకు వెళ్లామని.. పోలీసులు అంటున్నారు.