నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి తన మార్క్ “ప్రజాసేవ” చేశారు. నేరుగా ఓ మహిళా అధికారి ఇంటికే వెళ్లి బీభత్సం సృష్టించారు. ఇంటికి కరెంట్ కట్ చేశారు. పైప్ లైన్ తవ్వేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వాళ్లకు బతుకపై భయం కలిగే ప్రవర్తించి వెళ్లారు. ఆయన వెళ్లింది… మండల స్థాయి అధికారి అయిన ఎంపీడీవో సరళ ఇంటికి. తన అనుచరునికి సంబంధించిన ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌కు అనుమతి ఇవ్వడం ఆలస్యం అయిందన్న కారణంగా… కోటంరెడ్డి.. తన మార్క్ “ప్రజాసేవ”ను ఆమె కుటుంబానికి రుచి చూపించారు. స్వయంగా ప్రభుత్వ అధికారి ఇంటిపై దాడి చేసినా.. పోలీసులకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఆమె ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. అక్కడ పట్టించుకున్న వారు లేరు. దాంతో స్టేషన్ ముందే ధర్నా చేస్తున్నట్లుగా కూర్చోవాల్సి వచ్చింది.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇలాంటి దాడులు కొత్తేమీ కాదు. పైగా వాటిని ప్రజల కోసం తాను చేస్తున్న “ప్రజాసేవ”గా చెప్పుకుంటారు. కొద్ది రోజల కిందట.. జమీన్ రైతు అనే పత్రిక ఎడిటర్ ఇంటిపై దాడి చేశారు. ఓ డాక్టర్ చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లి… అడ్డం నరికేస్తా.. పేపర్లో రాసుకో అని హెచ్చరించి వచ్చారు. అంత జరిగినా.. పోలీసులు మాత్రం.. కేసు పెట్టలేదు. అంతకు ముందు.. మరో జర్నలిస్టును.. రోడ్డుపై అడ్డంగా నరికేస్తా.. దిక్కున్నచోట చెప్పుకో అని హెచ్చరిస్తూ.. ఆడియోలు బయటకు వచ్చాయి. అప్పుడూ ఎవరూ.. కేసులు పెట్టలేదు. అధికార పార్టీ అనే అండతో.. కోటంరెడ్డి.. ఎవర్నీ లెక్క చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దాడులతో అందర్నీ హడలెత్తిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ అయితే.. ఏమైనా చేయవచ్నచ్న అభిప్రాయం బలపడిపోతోంది. స్వయంగా జగన్ బొమ్మ పెట్టుకుని ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన కేసులు ఉండవని.. మంత్రులే ఆఫర్ ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటిది ఇక ప్రభుత్వంలో ఉన్న వారు.. ఎలా ఊరుకుంటారు..? అందరూ తమ తమ స్థాయిలో… అరచకాలు ప్రారంభించారు. కోటంరెడ్డి లాంటి సహజసిద్ధమైన ప్రజాసేవకులైతే ఎవర్నీ లెక్క చేయడం లేదు. స్వయంగా అసెంబ్లీలో… చంద్రబాబు వైపు వేలు చూపిస్తూ… ఖబడ్దార్.. అని హెచ్చరించిన ఘనత ఆయనది. ఆయన అలా హెచ్చరిస్తూంటే స్పీకర్, సీఎం జగన్ ముసిముసి నవ్వులు నవ్వారు. అదే ఆయనకు సేఫ్టీ సర్టిఫికెట్‌గా మారిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి.