వైసీపీలో ఉన్నప్పుడు తేడా కారణాలతో వార్తల్లో ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి వచ్చాక రాజకీయం మార్చేశారు. ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ విధానాల ప్రకారం మారాల్సి ఉంటుంది. దాన్ని కోటంరెడ్డి బాగానే అర్థం చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆయనపై ఎన్ని వివాదాలు వచ్చాయో చెప్పాల్సిన పనిలేదు. చివరికి ఆయనను నియోజకవర్గానికి వెళ్లవద్దని హైకమాండ్ చెప్పాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన ఆయన ఇప్పుడు.. నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమాలతో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు..
రూరల్ నియోజకవర్గం అత్యధికం సిటీలోనే ఉంటుంది. తన నియోజకవర్గంలో ఉన్న మౌలిక సమస్యలను గుర్తించి.. కొంత ఖర్చుతో అయిపోయే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలా రెండు, మూడు వందల పనులను గుర్తించారు. మంత్రి నారాయణతో కలిసి ప్రయత్నించి నిధులు తెచ్చుకున్నారు. ప్రజాభాగస్వామ్యంతోనే పనులు ప్రారంభిస్తున్నారు. ఈ పనులన్నీ ఆయన కాలనీలు, గ్రామాల ప్రజలు అడిగినవే. అందుకే వారితోనే శంకుస్థాపన చేయిస్తున్నారు.
కోటంరెడ్డి వ్యక్తిగతంగా ప్రజలతో వ్యవహరించే విధానం కూడా మారిపోయింది. గతంలో ఆయనంటే భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆయన అందరితో కలిసిపోతున్నారు. రాజకీయాన్ని రాజకీయంగా చేస్తున్నారు. వివాదాల జోలికి పోవడం లేదు. ఏదైనా అన్నా అది అభివృద్ధి కోసం.. పనుల కోసమే. చంద్రబాబు తన చుట్టూ తిరిగే వారికి ఏమీ ఉండదని.. ప్రజల్లో క్షేత్ర స్థాయిలో పని చేసే వారికే గుర్తింపు ఉంటుందని చెబుతున్నారు. దాన్ని కోటంరెడ్డి వంద శాతం ఆచరిస్తున్నారు.