కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చమని బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారని ఎమ్మెల్యేలను కొనేందుకు ఎంత డబ్బు అయినా సమకూరుస్తామని చెబతున్నామని బీఆర్ఎస్ కీలక నేత కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు .. ఆ పార్టీకి చాలా నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై కాంగ్రెస్ పైకి ఎలా స్పందించినా అంతర్గతంగా మాత్రం తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మరింత ప్రయత్నాలు చేయకుండా ఉండదు.
రేవంత్ ను అలర్ట్ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి
ఓ ఎమ్మెల్యే ప్రభుత్వం గురించి ఇలా మాట్లాడటం రెండు రకాలుగా జరుగుతుంది. మొదటిది మైండ్ గేమ్ లో భాగంగా మాట్లాడటం.. రెండోది శ్రేయోభిలాషి మాదిరిగా జాగ్రత్త పడండని హెచ్చరికలు జారీ చేయడం. ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున మైండ్ గేమ్ ఆడారా.. లేకపోతే రేవంత్ ప్రభుత్వానికి శ్రేయోభిలాషిగా మారి ముందస్తుగా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న హెచ్చరికల్ని పంపించారా అన్నది వారికే తెలియాలి. కారణం ఏదైనా కాంగ్రెస్ కు మాత్రం.. ఈ మాటలు అలర్ట్ కావడానికి ఓ సంకేతంలా కనిపించాయి.
ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముందస్తు లీక్
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు అంత స్థిమితంగా లేవు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా అని దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కారణంగా బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. సింపుల్ గా అయిపోవాల్సిన పనులు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. పదవుల కోసం కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేనికైనా సిద్ధమన్నట్లుగా ఉన్నారు. వారితో ఇలాంటి సమయంలో సంప్రదింపులకు అవకాశం ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పకనే చెప్పారు.
కాంగ్రెస్ అప్రమత్తమయిందా ?
ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ఏమైనా ప్రయత్నాలు జరిగి ఉంటే.. ఇవాళ కాకపోతే రేపు అయినా బయటకు వస్తారు. కాంగ్రెస్ పార్టీని వదిలేస్తారు. ఆ సమయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతాయి. బిల్డర్లు, పారిశ్రమికవేత్తల ఫండింగ్ తోనే ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించవచ్చు. అంత కంటే ముందు ప్రభుత్వాన్ని కాపాడుకునే చర్యల్ని కూడా చేపట్టారని అనుకోవచ్చు. మొత్తంగా కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ కు మేలు చేశాయని చెప్పుకోవచ్చు.