తమ పార్టీ గుర్తు మీద గెలిచి, ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ తో సన్నిహితంగా మెలగుతున్నందుకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత మీద వైసీపీ ఆగ్రహంతో ఉండడం సహజం. అయితే కొత్తపల్లి గీత కులానికి సంబంధించి ఇప్పుడు వివాదం రేగుతూ ఉండడం, ప్రభుత్వం దర్యాప్తులో తేలుస్తున్న వివరాలు, కోర్టులో కూడా నిలబడితే ఎంపీకి ఇబ్బంది తప్పదనే వాతావరణం ఉండడం పార్టీ కి హ్యాపీ గానే ఉండవచ్చు. ఎంపీ గీత ఎస్టీ కాదనే చర్చ ఇప్పుడు మళ్ళి తెరమీదకు వచ్చింది. ఆమె సోదరుడు ఎస్టీ కాదని జిల్లా కలెక్టరు దర్యాప్తు లో తేల్చడం, కలెక్టరు ఎదుట విచారణకు ఎంపీ గీత డుమ్మా కొట్టడం ఇప్పుడు తాజా విషయాలు.
అరకు ఎస్టీ నియోజకవర్గం అనే సంగతి అందరికీ తెలిసిందే. గీత సోదరుడు వివేకానంద కుమార్ కులం విషయంలో కలెక్టరు తదితర అధికారులు దర్యాప్తు చేసి అయన ఎస్టీ కాదని నిర్ధారణ చేసారు. వారు మాల క్రిస్టియన్ వర్గానికి చెందుతారని, ఎస్టీలు కాదని తేల్చారు. ఎంపీ గీత గనుక కలెక్టర్ ఎదుట విచారణకు వస్తే ఆమె విషయంలో కూడా అదే తేలుతుంది. కాకపోతే ఈ కలెక్టరు నిర్ణయంపై కోర్టును ఆశ్రయించడానికి వారికి 6 నెలల సమయం ఉంటుంది. ఇలా కోర్టు గడప తొక్కి సేఫ్ జోన్ లో ఉండాల్సిందే తప్ప… కులం వివాదాన్ని ఎంపీ గీత తప్పించుకోలేకపోవచ్చు. అందుకే.. ఇప్పుడు గీత కు ఎదురవుతున్న కష్టాలు చూసి.. వైసీపీ వర్గాలు హ్యాపీ గానే ఉంటాయని పలువురు అనుకుంటున్నారు.