వైసీపీ మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. మంగళవారం సీబీఐ కోర్టు ఈ తీర్పు ఇచ్చినా బుధవారం ఆమెను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపే వరకూ విషయం బయటకు తెలియలేదు. కొత్తపల్లి గీత ఆమె భర్త రామకోటేశ్వరరావుతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ఆమె తప్పుడు డాక్యుమెంట్లు తనఖా పెట్టి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో యాభై కోట్ల వరకూ రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టారు.
బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసి .. ఆమెపై నేరాన్ని రుజువు చేశారు. ఈ కేసులో కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్త.. సహకరించిన బ్యాంక్ అధికారులకూ శిక్ష పడింది. కొత్తపల్లి గీత ఉమ్మడి ఏపీలో డిప్యూటీ కలెక్టర్గా పని చేశారు. హైదరాబాద్లో పని చేస్తున్న సమయంలో విలువైన భూములను భర్త కంపెనీల పేరిట బదలాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ భూములనే తనఖా పెట్టి అప్లులు తీసుకుని ఎగ్గొట్టారు. తెలంగాణ మంత్రి తలసాని కుమారుడితోనూ వ్యాపార లావాదేవీలున్నాయి.. వీరి మధ్య విభేదాలు రావడం.. అవి మీడియాకు కూడా ఎక్కాయి.
ఇటీవలే అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనను కలిసిన వారిలో కొత్తపల్లి గీత కూడా ఉన్నారు. ఆమె బీజేపీలో చేరుతుందన్న ప్రచారం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో ఎంపీగా ఎన్నికైన కొత్తపల్లి గీత ఆ తర్వాత ఆ పార్టీతో దూరం జరిగారు. బీజేపీకి దగ్గరయ్యారు. అయితే గత ఎన్నికల సమయంలో ఏ పార్టీలోనూ చేరలేదు. కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరిగింది.