రాజకీయ పరిస్థితులను తనదైన కోణంలో విశ్లేషించే.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకులో ఈ సారి ఏపీ రాజకీయాలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టడం.. జగన్‌ను గెలిపించాలనే పట్టుదలకు పోవడం.. అందు కోసం.. సొంత పార్టీలను కూడా కాదని… విభిన్నంగా వ్యవహరించడం వెనుక ఉన్నది ఉమ్మడి లక్ష్యమేనని తేల్చారు. చంద్రబాబును ఓడిస్తేనే… తమకు రాజకీయ ప్రయోజనం కలుగుతుందని లేకపోతే… మొత్తానికే తేడా వస్తుందనే భావనలో వారిద్దరూ ఉన్నట్లు ఆర్కే విశ్లేషించారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులను.. చంద్రబాబుపై ఆరోపణలతో.. బ్యాలెన్స్ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తన యాప్ భేటీలో… ప్రయత్నించారు. ఇదంతా.. ఎన్నికల తర్వాత వైసీపీకి వచ్చే సీట్ల కోసమేనని ఆర్కే చెబుతున్నారు. అందులో నిజం లేకపోలేదు. ఇక కేసీఆర్ ఎందుకు జగన్ ను గెలిపించాలనుకుంటున్నారో గత వారమే చెప్పారు. అదే మరోసారి ఆర్కే చెప్పుకొచ్చారు. జగన్ ఏపీలో గెలిచే సీట్లన్నింటినీ.. కేసీఆర్ తన ఖాతాలో వేసుకోబోతున్నారు. జగన్ బలాన్ని కూడా తన బలంగా చూపించుకుని.. వచ్చే ఎన్నికల తర్వాత ఏకంగా ” ఉపప్రధాని” పదవి అందుకోవాలన్న ఆలోచన చేస్తున్నరానేది ఆర్కే విశ్లేషణ. ప్రత్యేకహోదా విషయంలో కేసీఆర్ గతంలో ఎన్ని మాటలు మాట్లాడినా.. ఇప్పుడు లేఖ రాస్తాననే సరికి… జగన్ చూపించిన ఉత్సాహం చూస్తే.. ఇద్దరి మధ్య అండస్టాండింగ్ ఉందని అనుకోక తప్పదు. ఆర్కే కూడా అదే చెప్పారు.
కొత్త పలుకులో టీఆర్ఎస్పై .. తన విశ్లేషణను ఘాటుగా ఉంచడంలో.. ఆర్కే ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. హరీష్ రావు అంశాన్ని చాలా పకడ్బందీగా విశ్లేషించారు. అంతపుర రాజకీయాల్లో.. జరగకూడనిదేదో జరుగుతోందని చెప్పుకొచ్చారు. ” కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఇటీవల వెళ్లిన కేసీఆర్ అక్కడ పనులు వేగంగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే ఆయన వ్యక్తంచేసిన ఆగ్రహం వెనుక వేరే కారణం ఉందని అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. నిజానికి ప్రాజెక్ట్ పనులు వేగంగానే జరుగుతున్నాయనీ, అయితే నిన్నటివరకు నీటిపారుదల శాఖమంత్రిగా ఉన్న హరీశ్‌రావు ఫెయిల్ అయ్యారని చెప్పడానికే కేసీఆర్ ప్రాజెక్టుల సందర్శన ఎంచుకున్నార”నీ ఆర్కే చెబుతున్నారు. పరిస్థితి చూస్తూంటే కాదనలేని సత్యం. ప్రగతి భవన్‌లోకి హరీష్ అడుగు పెట్టలేకపోతున్నారన్న భావన కూడా.. తన ఆర్టికల్‌లో వ్యక్తం చేసి.. వ్యవహారం నివురుగప్పిన నిప్పులానే ఉందని… చెప్పకనే చెప్పారు.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను… కేసీఆర్ ఏం చేసినా నోరెత్త ధైర్యం చేయలేకపోతున్న ఇతర పార్టీల నేతలు, మీడియా తీరును కూడా.. సున్నితంగా వివరించారు ఆర్కే. మంత్రుల్లేకుండా ప్రభుత్వం నడిపిన ఎన్టీఆర్ పై.. అప్పట్లో ఎలాంటి విమర్శలు వచ్చాయో గుర్తు చేసి.. ఇప్పుడెందుకు.. నోరెత్తలేకపోతున్నారో విమర్శించారు. ” ఇప్పుడు 25 రోజులుగా మంత్రిమండలి లేదు. అదేమిటని ప్రశ్నించే సాహసం తెలంగాణలో మీడియాకు కూడా లేదు” లేదని నిష్ఠూరమాడారు. చివరికి రాజకీయ నాయకుల భాష.. వారి తీరుపైనా ఆర్కే కలత చెందారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి సోము వీర్రాజు అనే నాయకుడు “లుచ్చా” అని దూషించినప్పుడు నరేంద్రమోదీ చిరునవ్వులు చిందించడం రోతగా ఉందని తీర్మానించారు.