ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే.. ఈ వారం “కొత్తపలుకు”ను ఏపీ సర్కార్.. తీసుకు వచ్చిన వివాదాస్పద జీవోపైనే కేంద్రీకరించారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను.. ఈనాడు రామోజీరావును టార్గెట్ చేసుకునే ఈ జీవో తీసుకొచ్చామని… మంత్రులు నేరుగా ప్రకటించారు. అందుకే.. ఆ జీవో వెనుక ఉన్న దురుద్దేశాలను పరోక్షంగా అయినా ప్రజల ముందు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ” మీడియాలో వచ్చే వార్తలు తమ పరువుప్రతిష్టలకు భంగం కలిగించాయని భావించిన సందర్భాలలో ప్రభుత్వాలేమిటి, సామాన్యులు సైతం పరువునష్టం కేసులు దాఖలు చేయవచ్చు. అయినా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో తెచ్చిందంటే మనసులో ఏదో దురుద్దేశం ఉన్నట్టు కనిపిస్తున్నది…” అని ఆర్కే.. జగన్మోహన్ రెడ్డి తెరవెనుక ఆలోచనలను.. బయట పెట్టే ప్రయత్నం చేశారు. అయితే… గతంలో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ఉన్నామని.. ఇప్పుడు కొత్తగా భయపడాల్సిందేమీ లేదని.. ఆర్కే తేల్చేశారు. ప్రతి మీడియా సంస్థ తన ప్రస్థానంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొంటూనే ఉంటుందన్నారు.
తన మీడియాకు కులాన్ని అపాదించే.. కొడాలి నాని వంటి మంత్రులతో తిట్టించడాన్ని ఆర్కే.. తీవ్రంగా ఆక్షేపించారు. “కలాలకు కాదు కులానికి మాత్రమే సంకెళ్లు..” అని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యపై ఆర్కే భగ్గుమన్నారు. పాఠకులను, వీక్షకులను సైతం కులాల ప్రాతిపదికగా విడదీస్తున్నారని.. ప్రణాళిక ప్రకారం కమ్మ సామాజికవర్గంపై ఇతర సామాజికవర్గాలలో ద్వేషభావాన్ని రగిలిస్తున్నారన్నారు. మనిషన్నవాడు ఎవడూ ఫలానా కులంలో మాత్రమే పుట్టాలని కోరుకుని పుట్టలేరు. ఇంతోటి దానికి కులద్వేషం ఎందుకో అర్థంకాని విషయమని ఆర్కే కొత్తపలుకులో విలువైన అభిప్రాయం వ్యక్తం చేశారు.
మీడియా రంగంలో ప్రముఖులుగా ఉంటూ.. జగన్ ప్రభుత్వ సలహాదారులుగా చేరిన వారి వ్యాఖ్యలపైనా.. ఆర్కే గట్టిగా స్పందించారు. రామచంద్రమూర్తి.. అన్నీ అబద్దాలు చెప్పారని.. గతంలో ఆయన రాసిన కథనాలు, చేసిన వ్యాఖ్యల ఆధారంగా బయట పెట్టారు. ఇంత కాలం పత్రికా ప్రపంచంలో ఉండి.. సంపాదించుకున్న గౌరవాభిమానాలన్నీ… రామచంద్రమూర్తి.. ఒక్క రోజులో పోగొట్టుకున్నారన్నారు. అలాగే దేవులపల్లిఅమర్ వ్యవహారశైలినీ విమర్శించారు. ఇప్పుడు… తాము సంపాదించుకున్న పేరుతో.. నాలుగు రూపాయలను పోగేసుకోవడానికి.. ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏం చేసినా… జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రజ్యోతి లొంగే ప్రశ్నే లేదని.. ప్రకటనలు ఆగిపోతాయి- ఆర్థికంగా దెబ్బతింటాం- కేసులతో ఇబ్బంది పడతామని భయపడిపోయి మడమ తిప్పడం మాత్రం జరగదని తేల్చేశారు.