ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం రాసిన “కొత్తపలుకు” ఆర్టికల్‌లో పూర్తిగా తెలంగాణ రాజకీయాలపైనే.. అదీ కూడా.. టీఆర్ఎస్ – బీజేపీ మధ్య ఉప్పు నిప్పులా వ్యవహారం ఎందుకు మారిందనే అంశం కేంద్రీకరించారు. ఈ అంశంలో .. తెరవెనుక రహస్యాలను… బయట పెట్టేందుకు.. ఆసక్తి చూపించారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వరకు.. టీఆర్ఎస్ – బీజేపీ వేర్వేరు కాదన్న అభిప్రాయం ఉంది. ఆ తర్వాత.. పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి కొద్దిగా దూరం పెరిగింది. ఇప్పుడు అది.. ఒకరంటే.. ఒకరికి పడని పరిస్థితి తయారైంది. ఇంత వేగంగా.. కేసీఆర్ – మోడీ మధ్య ఎందుకు.. సంబంధాలు చెడిపోయాయనేదానిపై.. ఇప్పటి వరకూ బయటకు తెలియని విషయాలను “కొత్తపలుకు”లో వేమూరి రాధాకృష్ణ వివరించారు.
ప్రత్యర్థులకు ఆర్థిక సాయం చేసిన కేసీఆర్..!
పార్లమెంట్ ఎన్నికల్లో.. తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించి… ఇతర పార్టీల మద్దతుతో.. కలిసి కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్… తన నాయకత్వం నడుస్తాయని భావించిన పార్టీలకు ఆర్థిక సాయం చేశారట. ” కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమార స్వామికి, తమిళనాడులో ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్‌కు, ఉత్తరప్రదేశ్‌లో మాయావతికి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారని బీజేపీ నాయకత్వం వద్ద కచ్చితమైన సమాచారం ఉందట! దీంతో, ముందుగా కేసీఆర్ పని పట్టాలని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయించుకున్నార”ని రాధాకృష్ణ నిగూఢ రహస్యాన్ని బయట పెట్టారు. అయితే. ఇందులో కొన్ని అధికార పార్టీలు ఉన్నాయి. జేడీఎస్, తృణమూల్‌లకు కేసీఆర్ ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఎంత ఉందో.. రాజకీయాల్లో తలపండిపోయిన వారే నిర్దారించుకోవాలి.
కేంద్రం తరపున గవర్నర్ రంగంలోకి దిగిపోయారు..!
రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడంలో… కేంద్రం స్టైల్ వేరుగా ఉంటుంది. గవర్నర్లను ఉపయోగించుకుని… ముందుగా.. ప్రభుత్వంపై.. ప్రజల్లో ఓ అనుమానం రేకెత్తించేలా చేస్తుంది. ఇప్పుడలాగే తెలంగాణలోనూ జరుగుతోందని… “కొత్తపలుకు”లో రాధాకృష్ణ తేల్చారు. గవర్నర్ నేరుగా.. వివిధ శాఖల అధికారులను పిలిపించుకుని సమీక్షలు చేస్తున్నారు. అదే సమయంలో.. తెలంగాణలో ఏం జరుగుతోందంటూ.. కాస్త అసహనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే.. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఎలా కావాలో.. అలా గవర్నర్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కేసీఆర్ తో సఖ్యత తనకూ.. మంచిది కాదని.. గవర్నర్ కూడా భావిస్తున్నారని… రాధాకృష్ణ తేల్చేస్తున్నారు.
ఏపీ పరిణామాలు తెలంగాణలో రిపీట్
ఏపీలో చంద్రబాబు చేసిన తప్పునే..ఇప్పుడు కేసీఆర్ చేయాల్సి వస్తోందని… వేమూరి రాధాకృష్ణ విశ్లేషించారు. ” శాసనసభ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలే ఇకపై తెలంగాణలో కూడా చోటు చేసుకోబోతున్నాయి. మరోవైపు, రాష్ట్రంలో పాలన పడకేసిందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించడానికై గవర్నర్‌ను ప్రయోగిస్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ స్వయంకృతాపరాధం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని” రాధాకృష్ణ విశ్లేషిస్తున్నారు. తాజా పరిణామాలు చూస్తే.. అదే నిజమని చెప్పక తప్పదు. తెలంగాణలో కేసీఆర్ .. సంగతి చూడాలనే.. మోడీ , షా నిర్ణయించుకున్నారని… ” కొత్తపలుకు”లో రాధాకృష్ణ తేల్చారు. అంటే గేమ్ స్టార్టయినట్లే..!