కర్నూలు సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో చేరికకు రంగం సిద్ధమయింది. ఆయన కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిన్నర్ కు ఆహ్వానించారు. ఆయన కూడా ఆహ్వానాన్ని మన్నించి విజయవాడ పయనమయ్యారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, ఆయన భార్య కోట్ల సూజాతమ్మ, ఆయన కుమారుడుతో పాటు.. ముఖ్య అనుచరుడు మబ్బు దేవనారాయణరెడ్డి కూడా.. సీఎంతో విందు భేటీకి హాజరు కాబోతున్నారు. మరో వైపు ఆయన టీడీపీలో చేరడం ఖాయం అయిందన్న సూచికగా.. కర్నూలు జిల్లాలోని ఆయన మద్దతుదారులు .. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేశారు. సూర్యప్రకాశ్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన అనుచరులు ప్రకటనలు చేస్తున్నారు. తన సన్నిహితులు, కుటుంబసభ్యులు టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నారని.. సూర్యప్రకాష్ రెడ్డి తన సన్నిహితులకు ఇప్పటికే స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడైన.. సూర్యప్రకాష్ రెడ్డి.. గతంలో ఎంపీగా మూడు సార్లు విజయం సాధించారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఆయన భార్య కోట్ల సుజాతమ్మ డోన్ ఎమ్మెల్యేగా పని చేశారు. కానీ రాష్ట్ర విభజన ఎఫెక్ట్ వారిపై పడింది. ఆ తర్వాత కూడా వారి కాంగ్రెస్ పార్టీని అంటి పెట్టుకునే ఉన్నారు. కొద్ది రోజుల కిందట.. రాహుల్ గాంధీని ఆహ్వానించి కర్నూలులో భారీ సభ కూడా పెట్టారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో.. ఒంటరిగా పోటీ చేసి నెగ్గడం సాధ్యం కాదని.. టీడీపీతో పొత్తులు పెట్టుకోవాలని ఆయన ప్రతిపాదించారు. అయితే.. టీడీపీ జాతీయ స్థాయిలో మాత్రమే సత్సంబంధాలు కోరుకుంది. దాంతో పొత్తు కుదరలేదు. చివరికి ఆయన టీడీపీలో చేరి .. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
కర్నూలు జిల్లాలో కోట్ల ఫ్యామిలీ చేరికతో టీడీపీకి అదనపు బలం సమకూరినట్లే. గత ఎన్నికల్లో.. కర్నూలు జిల్లాలో టీడీపీ పెద్దగా విజయాలు నమోదు చేయలేదు. ఆ తర్వాత టీడీపీలోకి పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకున్నాయి. అన్నింటికన్నా… కోట్ల ఫ్యామిలీ రాక.. తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూర్చనుంది. జిల్లా వ్యాప్తంగా అనుచరవర్గంతో పాటు మంచి పేరు కూడా ఉంది. అయితే.. కోట్ల వర్గానికి టిక్కెట్ల కేటాయింపు మాత్రం చంద్రబాబుకు ఇబ్బందికరమే కానుంది. కర్నూలు ఎంపీ టిక్కెట్, డోన్ టిక్కెట్లు కచ్చితంగా కోట్ల వర్గానికి కేటాయించాలి. కానీ.. ఎంపీ బుట్టా రేణుకతో పాటు డోన్ లో.. కేఈ సోదరుడు.. రేసులో ఉన్నారు. వీరికి చంద్రబాబు సర్ది చెప్పాల్సి ఉంది.