కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశంలో చేరేందుకు వచ్చే నెల 6న ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు సమాచారం. కర్నూలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ పార్టీలో చేరతారా, రాజధాని అమరావతికి పెద్ద సంఖ్యలో అభిమానులూ అనుచరులతో తరలి వెళ్లి ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరతారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే, కోట్ల చేరికను కె.ఇ. కృష్ణమూర్తి వర్గం కొంత వ్యతిరేకిస్తున్న మాట వాస్తవమే, వారితోపాటు బుట్టా రేణుకకు కర్నూలు ఎంపీ సీటు మాటేంటి అనే చర్చా జరుగుతున్న సంగతి తెలిసిందే. కేఈ, బుట్టాలకు పార్టీ అధినాయకత్వం కొంత సర్దిచెప్పిందనీ అంటున్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని ఇప్పటికే బుట్టా రేణుక స్పందించారు.
పార్టీలో చేరిక సందర్భంగా తనకి ఎంపీ సీటు, కోడుమూరు, డోన్, ఆలూరు అసెంబ్లీ స్థానాలను కోట్ల టీడీపీని అడుగుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. కోడుమూరు తన అనుచరులకు ఇవ్వాలనీ, ఆలూరులో తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని పట్టుపడుతున్న పరిస్థితి ఉందని సమాచారం. అయితే, డోన్ నియోజక వర్గం విషయమై ఇప్పుడు చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే, ఇక్కడ కోట్లతోపాటు, కేఈ కుటుంబానికి కూడా మంచి పట్టుంది. గతంలో డోన్ నుంచి కేఈ సోదరులు ఇద్దరూ గెలిచిన సందర్భాలున్నాయి. అలాగే, కోట్ల సుజాతమ్మ కూడా ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్రా ఉంది. అయితే, ఇప్పుడు డోన్ నియోజక వర్గం టికెట్ టీడీపీ నుంచి తన కుటుంబానికే కచ్చితంగా కావాలని కోట్ల పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.
ఇదే అంశమై కేఈ, కోట్ల వర్గాలు కాస్త పట్టుబడుతున్నట్టుగానే చర్చ జరుగుతోంది. ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుంటారనీ, కేఈ వర్గంతో మాట్లాడి ఒప్పించే అవకాశం ఉందనీ సమాచారం. ఆలూరు విషయంలో కూడా కొంత చర్చ జరుగుతోంది. అక్కడ టీడీపీ ఇన్ ఛార్జ్ వీరభద్ర గౌడ్ ఉన్నారు. అయితే, కోట్ల కోరినట్టుగానే ఇక్కడ ఆయన కుమారుడికి సీటిచ్చే అవకాశాలున్నాయనీ అంటున్నారు. ఇక, మూడోది.. కోడుమూరు మొదట్నుంచీ కోట్ల కుటుంబ సభ్యులకు మంచి పట్టున్న నియోజక వర్గం కాబట్టి, దానిపై టీడీపీలో పెద్దగా చర్చ జరిగే అవకాశాల్లేవు. ఇప్పుడు చర్చంతా డోన్ నియోజక వర్గం, కేఈ వర్గం స్పందన చుట్టూనే జరుగుతోంది. ఏదేమైనా, ఇవన్నీ ఒక కొలీక్కి రావడం ఖాయమనీ, కోట్ల వచ్చే నెల ఆరో తేదీన టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయమని ఆయన అనుచరులు చెబుతున్నారు.