ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తరాలుగా కాంగ్రెస్ లో ఉన్న నాయకులు సైతం ఇప్పుడు పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ను వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కోట్ల టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం అయినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో, కాంగ్రెస్ పార్టీ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వాదించారు. అయితే విజయవాడ లో జరిగిన ఈ సమావేశంలో, కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని గట్టిగా వాదించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, తన వాదన చెల్లకపోవడంతో సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు. ఒకవేళ టిడిపితో పొత్తు కుదిరితే, పొత్తులో భాగంగా కర్నూల్ ఎంపీ సీటు కాంగ్రెస్‌కు కేటాయింపచేసుకుని, కాంగ్రెస్ టికెట్ మీద కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ల మధ్య కేవలం జాతీయ రాజకీయాల్లో నే అవగాహన ఉంటుందని, రాష్ట్రస్థాయిలో ఎటువంటి పొత్తు ఉండదని ఖరారు కావడంతో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఎట్టకేలకు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.
అయితే మరో రెండు రోజుల్లో కార్యకర్తలతో సమావేశం అయి, తన తదుపరి కార్యాచరణ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీలో కర్నూలు ఎంపీ టికెట్ తనకు ఖరారు చేస్తే గనుక, తెలుగుదేశం పార్టీ చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే అప్పుడు ప్రస్తుతం కర్నూలు ఎంపీ గా ఉన్న బుట్టా రేణుక పరిస్థితి ఏమవుతుంది అనేది తెలియాల్సి ఉంది.