తెలంగాణాలో చాలామంది తెదేపా నేతలు, ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోవడంతో అక్కడ పార్టీ చాలా బలహీనపడిందని అందరికీ తెలుసు. తెదేపా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి తన పార్టీ నేతలను ఉద్దేశ్యించి కొన్ని ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. కనీసం పార్టీలో మిగిలిన నేతలయినా రాష్ట్రంలో పార్టీని కాపాడుకొనేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయకుండా పదవులిస్తేనే పార్టీ కోసం పనిచేస్తామన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఆంధ్రాలో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్ల కోసం ఆ రాష్ట్రంలో పార్టీ నేతల మధ్యనే తీవ్రపోటీ నెలకొని ఉన్నప్పుడు తెలంగాణా తెదేపా నేతలు కూడా వాటిపై ఆశలు పెంచుకోవడం అవివేకమని అన్నారు. అయినా ఏదో ఒక పదవి ఇస్తే తప్ప పార్టీ కోసం పనిచేయలేమనుకొన్న వాళ్ళతో తెలంగాణాలో తెదేపాకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకు రాలేమని దయాకర్ రెడ్డి అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఏ పదవులు, అధికారం లేకుండానే ప్రజలలో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు. అలాగే అధికారం కోరుకొంటున్న నేతలు కూడా ప్రజలలో తిరిగి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు గట్టిగా కృషి చేయాలని దయాకర్ రెడ్డి అన్నారు. పార్టీని పునర్నిర్మించుకోవడానికి కార్యకర్తలు సిద్దంగానే ఉన్నా నేతలు సిద్దంగా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
దయాకర్ రెడ్డి ఆవేదన సహేతుకంగానే ఉంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే తెలంగాణాలో పార్టీని పూర్తిగా విడిచిపెట్టేసినప్పుడు, పార్టీలో మిగిలిన నేతలకు మాత్రం దానిని పునర్నిర్మించుకోవాలనే ఆసక్తి ఎందుకు ఉంటుంది? తమ రాజకీయ భవిష్యత్ అయోమయంగా కనిపిస్తునందునే చాలా మంది తెదేపా నేతలు తెరాసలో చేరిపోతున్నారు. అది సాధ్యం కాని వాళ్ళు మాత్రమే తెదేపాలో కొనసాగుతూ ఏదోరకంగా పదవులు సంపాదించుకొందామని ప్రయత్నిస్తున్నారు. పార్టీ తెలంగాణా అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేకర్ రెడ్డి వంటివాళ్ళు పార్టీ తరపున తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించడానికే పరిమితం అవుతున్నారు తప్ప రాష్ట్రంలో మళ్ళీ పార్టీని పునర్నిర్మించుకోవడానికి ఎటువంటి కృషి చేస్తున్నట్లు కనబడరు. ఇటువంటి పరిస్థితులలో వచ్చే ఎన్నికల వరకు తెలంగాణాలో తెదేపా మనుగడ సాగించగలదా లేదా అని అందరూ అనుమానిస్తున్నపుడు, దయాకర్ రెడ్డి పార్టీ పునర్నిర్మాణం గురించి మాట్లాడటం విశేషమే. కానీ ఆయన గోడు వినేదెవరు?