తెలుగు360 రేటింగ్: 2.75/5
ఓ పల్లెటూరు అమ్మాయి..
ఊర్లో అబ్బాయిలతో క్రికెట్ ఆడడమే విచిత్రం, విడ్డూరం.
ఎన్ని అనుమానాలు, ఇంకెన్ని ఎత్తిపొడుపు మాటలు..??
పేదరికాన్ని, పరిస్థితుల్ని, సూటి పోటి మాటల్ని ఇవన్నీ దాటుకుని క్రికెటర్‌గా ఎదగడం ఎంత కష్టం..?
నిజంగా ఓ అమ్మాయి వీటన్నింటినీ ఎదిరిస్తే… కేవలం తండ్రి కళ్లలో ఆనందం చూడడం కోసం ఓ క్రికెటర్‌గా ఎదిగి, నాన్నముందు నిలబడితే..? ఎంత అద్భుతంగా ఉంటుంది..?
అదే – `కణ` కథ. అయితే అమ్మాయి, క్రికెట్టుతో పరిపెడితే, కణ కూడా మామూలు స్పోర్ట్స్ డ్రామా అయిపోదును. కానీ..దానికి రైతు సమస్యని జోడించడంతో – ఈ కథలో మరో కోణం కూడా చూపించే అవకాశం దక్కింది. అందుకే `కణ` తమిళంలో – నీరాజనాలు అందుకుంది. ఇలాంటి కథలు ఎక్కడైనా రాణిస్తాయి. ఆ నమ్మకంతోనే తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’గా తీసుకొచ్చారు. మరి… కణ చేసిన మ్యాజిక్ కౌసల్య చేయగలిగిందా? అక్కడి ఎమోషన్ ఇక్కడా పండిందా…?
కృష్ణమూర్తి (రాజేంద్రప్రసాద్) కి ఆ ఊర్లో క్రికెట్ పిచ్చోడు అనే పేరుంది. స్వతహాగా రైతు. వ్యవసాయం అంటే ప్రాణం. ట్రాక్టర్ని సైతం కన్నకొడుకులా సాకుతాడు. ఇండియా మ్యాచ్ ఆడుతోదంటే టీవీకి అతుక్కుపోతాడు. నాన్న చనిపోయాడన్న బాధ కంటే, ఆ క్షణంలో క్రికెట్ స్కోరు ఎంతో తెలుసుకోవాలన్న ఆత్రత ఎక్కువగా ఉంటుంది. ఇండియా ఓడిపోతే.. చిన్నపిల్లాడిలా గుక్కపెట్టి ఏడుస్తుంటాడు. కృష్ణమూర్తి టీవీలో మ్యాచ్ చూస్తుంటే అతని కళ్ళలో మ్యాచ్ చూస్తూ ఆనందిస్తుంటుంది కూతురు కౌసల్య (ఐశ్వర్య రాజేష్). వరల్డ్ కప్ ఓడిపోయి తండ్రి ఏడుస్తుంటే, నాన్న మొహంలో నవ్వు చూడ్డానికైనా క్రికెటర్ అవుతా, వరల్డ్ కప్ కొడతా అని ప్రతిజ్ఞ చేస్తుంది. ఆ కల ఎలా పెరిగి పెద్దదైంది? ఆ క్రమంలో, ఆ ప్రయాణంలో కౌసల్యకు ఎదురైన అవమానాలు, ప్రతికూల పరిస్థితులేంటి? వాటన్నింటినీ ఎలా దాటుకుని వచ్చింది? అనేది వెండి తెరపై చూడాలి.
బయోపిక్‌లు రాజ్యం ఏలుతున్న రోజులివి. ఓ క్రికెటర్ కథని నిజంగా తీశారా అనే పించేలా `కణ` కథని రాసుకున్నారు. ఓ అమ్మాయి క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో బహుశా ఇలాంటి సంఘటనలు, మలుపులే ఎదురవుతాయేమో అనిపించేలా మాయ చేశారు. నిజానికి ‘కణ’ కల్పిత కథే. కాకపోతే.. ఆ కథలో సన్నివేశాలు, సందర్భాలు చాలా సహజంగా ఉంటాయి. ఓ అమ్మాయి క్రికెట్ పై ఆసక్తి పెంచుకోవడం, అందుకోసం శ్రమించడం, ఓ క్రికెటర్‌గా ఎదిగి, తన దేశానికి కప్పు తీసుకురావడం – ఇదీ స్థూలంగా ‘కౌసల్య’ కథ. అయితే ఇదే కథకి సమాంతరంగా మరో కథ కూడా నడుస్తుంది. అది కృష్ణమూర్తి కథ. అన్నం పెట్టే రైతులు, అప్పుల పాలై ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాల్సివస్తుంది? అనే ప్రశ్నకు కృష్ణమూర్తి జీవన ప్రయాణంతో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. దేశానికి ఆడి కప్పు గెలిస్తే చప్పట్టు కొడుతున్నారు కదా, దేశానికి అన్నం పెట్టే రైతుకి ఈ ప్రోత్సాహం ఎందుకు ఉండదు? అని నిలదీసిన కథ ఇది. ‘కణ’లోని కదిలించే అంశం. ఇదే. దాన్ని ఏమాత్రం చెడకుండా, ఉన్నది ఉన్నట్టుగా తీసే ప్రయత్నం చేసింది కౌసల్య కృష్ణమూర్తి టీమ్.
పోలీస్ స్టేషన్లో.. వెన్నెల కిషోర్ కోసం `కౌసల్య, కృష్ణమూర్తి` ల కథ చెప్పడంతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. స్ట్రయిట్ నేరేషన్ కంటే, ఇలా చెబితే ఆసక్తిగా ఉండొచ్చని దర్శకుడు భావించి ఉండొచ్చు. వెన్నెల కిషోర్‌లాంటి టైమింగ్ ఉన్న నటుడు ఉండడం వల్ల పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సన్నివేశాలన్నీ సరదాగా సాగుతూ – కథలో ప్రేక్షకుడ్ని తొందరగా లీనమయ్యే అవకాశం కలిగించాయి. సాధారణంగా మన ఇంట్లో ఓ అమ్మాయి క్రికెట్ ఆడతానంటే.. ఎలాంటి అనుమానాలు మొదలవుతాయో, చుట్టుపక్కల కళ్లూ, మన మనసులూ ఏం ఆలోచిస్తాయో కౌసల్య జీవితంలో అవే జరుగుతాయి. కౌసల్య తపన, అంచెలంచెలుగా ఎదిగే క్రమం కళ్లకు కట్టినట్టు చూపించారు. డిటైలింగ్ కోసం ప్రతీ సన్నివేశాన్నీ నిదానంగా, సవివరంగా చెప్పే ప్రయత్నంలో.. సినిమా టెంపో అప్పుడప్పుడూ తగ్గుతుంది. ట్రాక్టర్లానే ముందుకెళ్లడానికి మొరాయిస్తుంటుంది. విశ్రాంతికి ముందొచ్చే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్లో కౌసల్యకు వకాల్తా పుచ్చుకుని కృష్ణమూర్తి మాట్లాడడం ప్రతి అమ్మాయి తండ్రికీ నచ్చుతుంది.
ద్వితీయార్థంలో కోచ్ ప్రవేశంతో… హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కాస్త హీరో సినిమాలా మారిపోతుంది. చక్ దే ఇండియాలో షారుఖ్‌ఖాన్ పాత్రకు స్ఫూర్తిగా సాగిన కోచ్ పాత్ర కూడా రక్తి కడుతుంది. ఆ పాత్రలో కన్నడ స్టార్ శివ కార్తికేయన్ కనిపిస్తారు. కణలోనూ ఆయనే నటించారు. ఇది రీమేక్ కాబట్టి, మాతృకలోని సన్నివేశాల్ని వాడుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి, ఆ స్వేచ్ఛని ఇంకాస్త ఎక్కువే తీసుకుని, కణలోని సన్నివేశాల్ననీ అక్కడ కత్తిరించి, ఇక్కడ వాడుకున్నారు. తొలి సగంలో అచ్చమైన పల్లెటూరి సినిమాలా కనిపించిన కౌసల్య, ద్వితీయార్థానికి వచ్చేసరికి డబ్బింగ్ లుక్‌లోకి వచ్చేస్తుంది. సెకండాఫ్‌లో దాదాపు 40 శాతం సన్నివేశాలు కణలోనివే. శివకార్తికేయన్ చాలా బాగా చేశాడు. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. కానీ ఆ పాత్రలో మన తెలుగు హీరో ఉండుంటే, ఏ నానినో కోచ్‌గా చేసి కథని నడిపిస్తే తప్పకుండా `కౌసల్య`… ఓ జెర్సీలా నిలబడిపోయే సినిమా అయ్యేది. ఎప్పుడైతే శివ కార్తికేయ కనిపించాడో.. అక్కడి నుంచి తమిళ వాసన కొట్టడం మొదలైంది. మధ్యమధ్యలో రాజేంద్రప్రసాద్ సీన్లు కవర్ చేసుకుంటూ రావడం వల్ల – ఆ ప్రభావం కొంత వరకూ తగ్గంచారు.
ఏ స్పోర్ట్స్ డ్రామానైనా ఒకే విధంగా ముగుస్తుంది. విజేతగా నిలవడంతో కథ ని ఆపేస్తారు. ఇక్కడా అదే జరిగింది. కానీ పతాక సన్నివేశాల్లో రైతుల గురించి ఓ క్రికెటర్ మాట్లాడడం.. సరదాగా ఆడాల్సిన ఆటని సీరియస్‌గా చూసే జనం, సీరియస్‌గా చేసే వ్యవసాయాన్ని కనీసం ఆటలా అయినా చూడడం లేదేంటి? అనే చర్చని లేవదీస్తుంది. పతాక సన్నివేశాల్లోని సంభాషణలు రైతుల దుస్థితికి అద్దం పడతాయి. దాంతో.. ఈ స్పోర్ట్స్ క్లైమాక్స్‌ని మరో తరహా ముగింపు దొరికినట్టైంది.
కణలో నటించిన ఇద్దరు ప్రధాన పాత్రలు ఈ సినిమాలోనూ కనిపించాయి. వాళ్లే ఐశ్వర్య, శివ కార్తికేయన్. ఐశ్వర్య కు తన పని మరింత సులభమైంది. డీ గ్లామరైజ్డ్ పాత్రలో ఒదిగిపోయింది. శివ కార్తికేయన్ నటించిన ‘డబ్బింగ్’ సినిమాల్లో ఇదొకటి అనుకోవచ్చు. రాజేంద్రప్రసాద్, ఝాన్సీల పాత్రలు ఈ కథకి చాలా కీలకం. రాజేంద్ర ప్రసాద్ లోని నటుడికి మరోసారి ఆహారం దొరికిన పాత్ర ఇది.కానీ.. ఆయన గెడ్డం, మేకప్ అస్సలు సూటవ్వలేదు. రాజేంద్ర ప్రసాద్ ఎంత బాగా నటిస్తున్నా, అవి రెండూ పంటికింద రాళ్లలా తగులుతూనే ఉన్నాయి. ఝాన్సీ అదృష్టవశాత్తూ ఈసారి ఓవర్ యాక్షన్ జోలికి పోలేదు. వెన్నెల కిషోర్, మహేష్ కాస్త నవ్విస్తారు. హీరోలా అనిపించి సపోర్టింగ్ రోల్‌కి పరిమితమయ్యాడు.. కార్తీక్ రాజు.
సాంకేతికంగానూ ఈ సినిమా బాగుంది. ద్వితీయార్థం పక్కన పెడితే (ఎందుకంటే అవన్నీ కణలో సీన్లే) తొలి భాగంలో పల్లెటూరి వాతావరణం, క్రికెట్ ఆట.. ఇవన్నీ బాగానే క్యాప్చర్ చేశారు. కణకు పనిచేసిన థామస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కాబట్టి అక్కడి ట్రాక్‌లను యధావిధిగా వాడుకునే అవకాశం దక్కింది. రైతుల గురించి రాసిన మాటలు (కొన్ని ఫేస్ బుక్ కొటేషన్లు తగిలినా) ఆకట్టుకుంటాయి. కణని గుడ్డిగా ఫాలో అయిపోవడమే పనిగా పెట్టుకున్నాడు భీమనేని. ఈ కథలో మార్పులు చేర్పులూ చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా తీస్తే సగం విజయం దక్కినట్టే. అలా తీయడం కూడా రావాలి. ఈ విషయంలో తాను సిద్ధహస్తుడనని ఆయన మరోసారి నిరూపించుకున్నారు.
కణ చూసినవాళ్లకు కౌసల్య కృష్ణమూర్తి డబ్బింగ్ సినిమాలా అనిపిస్తుంది. కానీ కణ గురించి ఏమాత్రం ఆలోచించకుండా, కౌసల్యని తెలుగు సినిమాలా చూడాలనుకున్నవాళ్లు నిరభ్యంతరంగా `కౌసల్య కృష్ణమూర్తి` ఎంచుకోవొచ్చు. చక్ దే ఇండియా, దంగల్ లాంటి స్పోర్ట్స్ డ్రామాలు మనమూ తీయగలం అని జెర్సీలాంటి సినిమాలు నిరూపిస్తున్న తరుణంలో – కౌసల్య మరో తాజా ఉదాహరణగా నిలుస్తుంది!
ఫినిషింగ్ టచ్: కౌసల్య.. ది ఛాంపియన్
తెలుగు360 రేటింగ్: 2.75/5