కేసీఆర్ సర్కారు మీద కొన్నేళ్లుగా విపక్షాలు ఆ విమర్శ చేస్తూనే ఉన్నాయి! సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తుచేస్తూనే ఉన్నాయి. కానీ, దీనిపై కేసీఆర్ సర్కారు ఇంతవరకూ సూటిగా స్పందించిన సందర్భాలు లేనే లేవు. మిగతా విమర్శలైతే వారి వాక్చాతుర్యంతో కొట్టి పారేస్తారు. కానీ, ఈ విమర్శను తిప్పికొట్టాలంటే మంత్రి వర్గంలో మార్పులు చేయాలి కదా! అదేనండీ.. కేసీఆర్ క్యాబినెట్ లో మహిళలకు స్థానం లేదన్న విమర్శ. క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే కథనాలు వచ్చిన ప్రతీసారీ మహిళా ఎమ్మెల్యేకి చోటు గ్యారంటీ అనే వార్తలూ వస్తుంటాయి. కానీ, ఇంతవరకూ ఆ విస్తరణే జరగలేదు. త్వరలోనే ఉంటుందీ ఉంటుందీ అంటూ ఊరిస్తూ వచ్చారే తప్ప.. ఇంతవరకూ, ఆ దిశగా కేసీఆర్ ఆలోచించింది లేదు. అయితే, తాజాగా వినిపిస్తున్న కథనాలేంటంటే… అనారోగ్య కారణాల రీత్యా ఇద్దరు ప్రముఖులను క్యాబినెట్ నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలుస్తోంది..!
మంత్రులు నాయని నర్సింహా రెడ్డి, అజ్మీరా చందూలాల్ లను బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉన్నట్టు తెరాస వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనారోగ్య కారణాల ప్రాతిపదికనే ఈ ఇద్దరినీ మార్చాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. వీరి స్థానాల్లో ఎవరిని భర్తీ చేస్తారనే చర్చ కూడా సహజంగా ఉంటుంది కదా. నర్సింహా రెడ్డి స్థానంలో ఎవర్ని భర్తీ చేస్తారన్నదానిపై కంటే.. చందూలాల్ స్థానంలో భర్తీ కాబోతున్న ఎమ్మెల్యే పేరే ప్రముఖంగా వినిపిస్తూ ఉండటం విశేషం. అసిఫాబాద్ ఎమ్మెల్యే కొవ లక్ష్మీ పేరు అనూహ్యంగా తెరమీదికి వస్తోంది. రాబోయే ఏడాదిన్నర కాలానికి ఆమెకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా, ఆమెది గిరిజన ఆదివాసీ తెగకు చెందిన కుటుంబం కావడం కూడా గమనార్హం!
ఆమెకు మంత్రి పదవి ఇచ్చినట్టైతే గిరిజన మహిళకు ప్రాధాన్యత కల్పించామని చెప్పుకోవచ్చు. ఎన్నాళ్లుగానో ఇతర పార్టీల నుంచి వినిపిస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్టు అవుతుంది. అయితే, కోవ లక్ష్మీకి అవకాశం కల్పించడం ద్వారా మరో సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు అనేది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. తెలంగాణలోని గిరిజన, ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తారనీ, గిరిజన ఆదివాసీలతో భారీ ఎత్తున సభ నిర్వహిస్తారని గత కొన్ని నెలలుగా అనుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లంబాడాలు, ఆదివాసీలు మధ్య వర్గ పోరు కొనసాగుతోంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. పాలకుల పట్ల ఆదివాసీల్లో ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ అందిపుచ్చుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆదివాసీ మహిళకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా వారిని శాంతింపజెయ్యొచ్చు అనేది కూడా తెరాస వ్యూహంలో భాగంగా తెలుస్తోంది. ఒక నిర్ణయంతో రెండు సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి, లక్ష్మీ విషయంలో త్వరలోనే ప్రకటన ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందని తెలుస్తోంది.