సినిమా – క్రికెట్ రెండూ ఒక్కటే. ఏమాత్రం ఫామ్ లో లేని బ్యాట్‌మెన్.. మళ్లీ కుదురు కోవాలంటే ఒక్క ఇన్నింగ్స్ చాలు. సినిమాల్లోనూ అంతే. ఒక్క సినిమా.. ఒక్క సినిమా చాలు. జాతకాలు మారిపోవడానికి. ఫ్లాపు స్టార్లు…. హిట్ రేసులో పరుగులు పెట్టడానికి. శ్రుతిహసన్ విషయంలో అదే జరుగుతోంది. నిన్నా మొన్నటి వరకూ శ్రుతిహాసన్ ని ఎవ్వరూ పట్టించుకోలేదు. శ్రుతిని అవుట్ డేటెడ్ హీరోయిన్ల జాబితాలో చేర్చేశారు. శ్రుతి కూడా తెలుగు సినిమాలు చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. క్రమంగా శ్రుతి కెరీర్ కి తెలుగులో పుల్ స్టాప్ పడినట్టే అనిపించింది.
అయితే సడన్ గా శ్రుతి లయ అందుకోగలిగింది. `క్రాక్` విజయం శ్రుతిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తన కెరీర్‌కి కొత్త దారి చూపిస్తోంది. నిజానికి `క్రాక్`లో శ్రుతిది సో..సో పాత్రే. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ ని ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో.. అంతకంటే ఒక మెట్టు తక్కువగానే ఉండే పాత్ర అది. అయితే సెకండాఫ్ లో ఒక్క ఫైట్ ఇచ్చి.. శ్రుతి పాత్రని అమాంతం పైకి లేపేశాడు దర్శకుడు. ఆ సినిమాలో అది మాస్ కి కిక్కిచ్చే మూమెంట్ మాత్రమే కాదు. శ్రుతి కెరీర్‌కి సైతం టర్నింగ్ పాయింట్ గా మిగిలిపోయింది. `క్రాక్` హిట్టవ్వడం.. శ్రుతికీ మంచి పేరు రావడంతో.. ఇప్పుడు దర్శక నిర్మాతలు.. తమ ప్రాజెక్టుల కోసం శ్రుతిహాసన్ పేరూ గట్టిగానే పరిశీలించడం మొదలెట్టారు. `వకీల్ సాబ్`లో హీరోయిన్ గా చేస్తోంది శ్రుతి. `పిట్టకథలు` అనే వెబ్ మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు వార్తలొస్తున్నాయి. `సలార్`లో శ్రుతిని ఓ హీరోయిన్ గా ఎంచుకున్నట్టు టాక్. అదే జరిగితే.. శ్రుతి దశ తిరిగినట్టే. అది ఒక్క సినిమాతో కాదు. అందులోని ఒకే ఒక్క ఫైటుతో. సినిమా సిత్రాలన్నీ ఇలానే ఉంటాయి మరి.