టేలర్ మేడ్ క్యారెక్టర్స్ అని కొన్నుంటాయి. ఓ హీరోకంటూ పక్కాగా సూటైపోయే క్యారెక్టర్ అంటూ ఒకటి ఉండడం అదృష్టం కూడా. సేఫ్ జర్నీ చేయాలనుకున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ ఒకటి ఎంచుకుంటే చాలు. అలాగని టేలర్ మేడ్ క్యారెక్టర్లు ఎంచుకున్న ప్రతీసారీ సేఫ్ గేమ్ ఆడేస్తారని కాదు. ప్రమాదాలు తక్కువ జరుగుతాయి. అంతే. రవితేజకీ అలాంటి క్యారెక్టర్లు కొన్నున్నాయి. వాటిలో పోలీస్ పాత్ర ఒకటి. విక్రమ్ సింగ్ రాథోడ్.. లాంటి పాత్రలు రవితేజకు కొట్టిన పిండి. రవితేజ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు. ప్రయోగాల జోలికి వెళ్లే ధైర్యం లేదు. కొత్త కథలు ఎంచుకునేంత రిస్క్ చేయలేడు. అందుకే పూర్తిగా తనకు ఫిట్ అయిపోయే ఓ కథని ఓకే చేశాడు. అదే `క్రాక్`. మరి ఈసారి ఈ పాత్రలో రవితేజ ఎంత చెలరేగిపోయాడు..? రవితేజ కోరుకున్న రిజల్ట్ వచ్చేసినట్టేనా? కాస్త డిటైలింగ్ లోకి వెళ్తే…
వీర శంకర్ (రవితేజ) తల తిక్క పోలీస్ అధికారి. కర్నూలులో సలీమ్ అనే ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆట కట్టించినందుకు సీఐగా ప్రమోషన్ వస్తుంది. అక్కడ్నుంచి ఒంగోలు ట్రాన్స్ఫర్ మీద వస్తాడు. ఒంగోలులో.. కఠారి కృష్ణ (సముద్రఖని) చేయని అకృత్యం ఉండదు. తనకు ఎవరు ఎదురెళ్లినా.. చావునే బహుమతిగా ఇచ్చే కిరాతకుడు. తనని వీర శంకర్ ఢీ కొడతాడు. వారిద్దరి మధ్య ఏం జరిగింది? కఠారి కృష్ణ దగ్గర… వీర శంకర్ తన క్రాక్.. ఎలా చూపించాడు? అనేది మిగిలిన కథ.
గోపీచంద్ మలినేని ఈ కథని రాసుకున్నప్పుడు `కొత్తగా ఏం రాద్దాం?` అని ఆలోచించలేదు. రవితేజని కొత్తగా ఎలా చూపిద్దాం? అని కిందామీద పడలేదు. కేవలం రవితేజకి సూటైపోయే కథ రాస్తున్నానా? ఇందులో రవితేజకు కావల్సిన అంశాలు ఉన్నాయా? లేదా? అనేవి మాత్రం చూసుకున్నాడంతే. లాజిక్కుల గురించి పట్టించుకోలేదు. థియేటర్లో మాస్ విజిల్స్ వేసే సీన్లు ఉంటే చాలు.. అనుకున్నాడు. సరిగ్గా.. ఈ కొలతలతో.. సినిమా తయారైపోయింది. ఫైట్లు, పాటలు, హీరోయిజం.. ఇవన్నీ మాస్‌ని ఎల్లప్పుడూ మెప్పిస్తాయి. కాకపోతే.. వాటిని ప్లేస్ చేయాల్సినంత మేటర్ కథలో ఉండాలి. ఫైటు కోసం ఫైటు.. పాట కోసం పాట అనుకుంటే అవి ఎంత గొప్పగా ఉన్నా.. రుచించవు. ఫైట్ కి ముందూ వెనుకా.. కాస్త బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. అవన్నీ గోపీచంద్ మలినేని పక్కాగా చూసుకున్నాడు. రొటీన్ స్టోరీని.. కాస్తయినా కొత్తగా చూపించాలన్న తపన కనిపించింది. అందుకే.. నిమ్మకాయ, పచ్చనోటు.. మేకు.. అంటూ… రొటీన్ కథని ఇంట్రస్టింగ్ గా మొదలెట్టాడు.
రవితేజ ఓ మాస్ హీరో. తనలాంటి వాడుదొరికితే..ఎలివేషన్లు వీలైనన్ని రాసుకోవొచ్చు. గోపీచంద్ మలినేని కూడా వాటిపైనే ఎక్కువగా ఆధారపడ్డాడు. ప్రతీసారీ.. హీరో ఎలివేషన్లేంటి? అనిపించినా, అవి కాస్త మాస్‌కి నచ్చేలా డిజైన్ చేసుకోవడంతో.. ఎక్కడా విసుగురాలేదు. యాక్షన్ డోసు, రక్తపాతం. మితిమీరిన సవాళ్లు… ఇవన్నీ కాస్త ఓవర్ డోస్ గా అనిపిస్తాయి. కానీ.. ఆయా సన్నివేశాల్లో రవితేజ ఎనర్జీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగులు ఇవన్నీ ప్లస్ అయ్యాయి. దాంతో.. ఆయా సీన్లు పాసైపోవడమే కాదు. ఆడిటోరియంని అరెస్ట్ చేయగలిగాయి. సినిమా అంతా ఒకే టెంపోలో సాగుతూ ఉంటుంది. శ్రుతిహాసన్ తో రొమాంటిక్ సీన్లు.. ఫ్యామిలీ డ్రామా.. కాస్త స్పీడ్ బ్రేకర్లు వేస్తుంటాయి. అలాంటప్పుడే దర్శకుడు తేరుకుని మళ్లీ యాక్షన్ మూడ్ లోకి వెళ్లిపోగలిగాడు. దాంతో..ట్రాక్ తప్పుతున్న ప్రతీసారీ.. క్రాక్ మళ్లీ.. క్రాకర్ లా పేలుతూనే ఉంది. యాక్షన్ సీన్లు బాగా డిజైన్ చేసుకోవడం ఈసినిమాకి ప్లస్. ముఖ్యంగా ఒంగోలు బస్టాండ్ ఫైట్… మాస్ కి విపరీతంగా నచ్చేయడమే కాదు.. ఈసినిమా టెంపోని అమాంతం పెంచేస్తుంది. విలన్ క్యారెక్టర్లకు సైతం… సెపరేట్ బాడీ లాంగ్వేజ్ ఉండడం, సముద్రఖని, వరలక్ష్మిలాంటి వాళ్లు యాడ్ అవ్వడం… బాగా కలిసొచ్చింది.
అయితే దర్శకుడు చాలా విషయాల్లో హీరోయిజాన్నే నమ్ముకుంటూ వెళ్లాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్స్‌లో సైతం లాజిక్కుల జోలికి వెళ్లకుండా హీరోయిజంపై ఆధారపడ్డాడు. సదరు సన్నివేశాలు హీరోలోని తెలివితేటల్ని, ఇన్వెస్టిగేషన్ మెథడ్ ని బయటపెట్టకుండా – అక్కడా మాసిజాన్నే ప్రజెంట్ చేస్తాయి. సెకండాఫ్ మరీ సీరియస్ మోడ్ లో సాగిపోతుంది. రవితేజ కోసమో, రిలీఫ్ కోసమే అక్కడ సెపరేట్ కామెడీ ట్రాకులు పెట్టకుండా కథకే మౌల్డ్ అవ్వడం నచ్చుతుంది. కాకపోతే.. ట్రిమ్ చేసుకోదగిన సీన్లు కొన్ని కనిపిస్తాయి.
రవితేజ ఒంటిచేత్తో `క్రాక్` ని నడిపించేశాడు. తన బాడీ లాంగ్వేజ్ ఎప్పటిలానే మెస్మరైజ్ చేస్తుంది. లుక్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలేమో అనిపిస్తుంది. వయసు పెరుగుతుందన్న విషయం.. మేకప్ మెరుగులు, డీఐలు సైతం దాచలేకపోయాయి. శ్రుతిహాసన్ ది చిన్న పాత్రే. తాను చేయడానికి ఏం లేకుండా పోయింది. సముద్రఖని విశ్వరూపం చూపించాడు. రవితేజ – సముద్రఖని మధ్య సాగే సన్నివేశాలు ఈ సినిమాకి కీలకం. రాధిక శరత్ కుమార్ సైతం.. ఆకట్టుకుంటుంది.
తమన్ పాటలు హుషారుగా ఉన్నాయి. మాస్ బిరియానీ.. లాంటి పాటలు సింగిల్ స్క్రీన్ లో చూస్తే చాలా కిక్ ఇస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా సన్నివేశాల్ని ఎలివేట్ చేశాడు తమన్. అయితే.. కొన్ని చోట్ల.. ఆ బాదుడే మరీ శ్రుతిమించినట్టు అనిపిస్తుంది. కెమెరా పనితనం, ఖర్చు.. ఇవన్నీ సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చాయి. గోపీచంద్ మలినేని ఓ రొటీన్ కథని, ఊహాజనితమైన స్క్రీన్ ప్లేతో రాసుకున్నప్పటికీ… మాస్‌కి ఏం కావాలో అది ఇచ్చేశాడు. రవితేజతో ఏం చేయించాలో అది చేయించేశాడు. కొన్ని యాక్షన్‌సీన్లు, దానికిచ్చిన ఎలివేషన్లు బాగా పండడంతో.. ఈ సినిమా నిలబడిపోయింది.
రొటీన్ ఫార్ములా అనేది ఎంత ప్రమాదకరమో.. దాన్ని సరిగా వాడుకుంటే… అంత ఉపయోగకరం. కొన్నిసార్లు.. రొటీన్ విషయాల్ని ప్రేక్షకుల్ని రంజింపచేసేలా చెప్పొచ్చు. తీయొచ్చు. దానికి… క్రాక్ ఓ మంచి ఉదాహరణ. ఈ సంక్రాంతికి ప్రేక్షకులు అన్ని రకాల రుచులూ కోరుకుంటారు. ఆ రుచుల్లో `క్రాక్`.. ఓ మాస్ బిరియానీ.
ఫినిషింగ్ టచ్: సంక్రాంతి ‘క్రాకర్’
రేటింగ్: 3