`రైతు` అనే కథని నందమూరి బాలకృష్ణ లాక్ చేయడం, దాన్ని తన వందో సినిమాగా తీయాలనుకోవడం, కృష్ణవంశీకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం, ఓ కీలక పాత్ర కోసం బిగ్ బీని సంప్రదించడం, ఆ తరవాత దాన్ని పక్కన పెట్టేయడం.. ఇవన్నీ తెలిసిన విషయాలే. అయితే ‘రైతు’ స్క్రిప్టుపై బాలయ్య కు విపరీతమైన నమ్మకం. అందుకే దాన్ని హోల్ట్లో పెట్టేశాడు. ఎప్పుడైనా, ఏ క్షణంలో అయినా రైతు ప్రాజెక్టు పట్టాలెక్కేయొచ్చు. అయితే… మరో ‘రైతు’ కథ బాలయ్య చెంతకు చేరింది. ఓనమాలు, సొంత ఊరు సినిమాలతో ఆకట్టుకొన్న దర్శకుడు క్రాంతిమాధవ్ .. ఆమధ్య బాలయ్యకు ఓ కథ వినిపించాడట. అది కూడా రైతు కథేనట. అమరావతిలో భూముల్ని కోల్పోయిన ఓ రైతు కథని సినిమాటిక్ వాల్యూస్ జోడించి స్క్రిప్టు తయారు చేశాడట క్రాంతి మాధవ్. ఆ కథకు బాలయ్యే న్యాయం చేయగలడన్న ఉద్దేశంతో, బాలయ్యని కలసి కథ వినిపించాడట.
ఈ కథ బాలయ్యకు బాగా నచ్చిందట. అయితే… తన దగ్గర ఆల్రెడీ ఓ రైతు కథ ఉండడం, క్రాంతి మాధవ్ కథలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనిపించేలా కొన్ని సీన్లు ఉండడంతో సున్నితంగా ‘నో’ చెప్పాడట. ”ఈ కథని ఏ హీరోతో అయినా తీయండి. బాగుంటుంది. తప్పకుండా హిట్ అవుతుంది” అని క్రాంతిమాధవ్ భుజం తట్టి అభినందించాడట. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సునీల్ తో ఉంగరాల రాంబాబు అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తరవాత.. ఓ పెద్ద హీరోతోనే ఈ రైతు కథ ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.