‘అర్జున్‌రెడ్డి’ సినిమా విజయ్ దేవరకొండను యువతరానికి ఎంత దగ్గర చేసిందో… కుటుంబ ప్రేక్షకులకు అతణ్ణి అంతకు అంత దూరం చేసింది. ముఖ్యంగా విడుదల సమయంలో విజయ్ దేవరకొండ ప్రవర్తన కూడా వివాదాస్పదం అయ్యింది. అందుకని, కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడీ హీరో. ‘టాక్సీవాలా’ కోసం చిన్న పిల్లలతో స్పెషల్ పబ్లిసిటీ వీడియో షూట్ చేసి విడుదల చేయడం వెనుక కారణం అదే. ‘టాక్సీవాలా’ తర్వాత వచ్చే ‘గీత గోవిందం’ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్. అతడు చేస్తున్న మరో సినిమా ‘డియర్ కామ్రేడ్’ యాక్షన్ జానర్. ప్రస్తుతం లైనులో వున్న ఈ సినిమాలు పూర్తయ్యాక క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె.ఎస్. రామారావు నిర్మించే సినిమా అంగీకరించాడు.
దర్శకుడిగా క్రాంతిమాధవ్ శైలి ఏంటనేది ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చెబుతాయి. నిర్మాత కె.ఎస్. రామరావుకి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తీస్తారని పేరుంది. ఆల్రెడీ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ‘మళ్ళీ ఇది రాని రోజు’ చేశారు. ఈ కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ సినిమా చేయడానికి కారణం కుటుంబ ప్రేక్షకుల అండ కోసమే. అక్టోబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని నిర్మాత తెలిపారు. క్రాంతిమాధవ్ శైలిలో కుటుంబ ప్రేక్షకులు చూసేలా ప్రేమకథతో సినిమా వుంటుందట!!